అరాచకాలకు రె’వెన్యూ’
జూదశాలగా జిల్లా ’రెవెన్యూ భవనం’
పట్టపగలే పేకాట
అడ్డంగా దొరికిన అసోసియేషన్ నేత సాగర్
కామవరపుకోట తహసీల్దార్ కూడా..
ఏలూరు (మెట్రో) : అరాచకాలకు, అసాంఘిక కార్యకలాపాలకు ఏలూరులోని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ భవనం వేదికైంది. ఆదివారం భవనంలో పేకాట ఆడుతూ.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్‌తోపాటు కామవరపుకోట తహసీల్దార్ నరసింహరాజు, మరో వ్యక్తి మార్రాజు పట్టుబడడం సంచలనం సృష్టించింది. గతం నుంచి జిల్లా రెవెన్యూ భవనం వెల్లువెత్తుతున్న ఆరోపణలకు ఈ ఘటన బలం చేకూర్చింది.
గతం నుంచే ఇదే పరిస్థితి
జిల్లా కేంద్రమైన ఏలూరు నడిబొడ్డులో ఉన్న ఫైర్‌స్టేషన్ సెంటరులో జిల్లా రెవెన్యూ రెవెన్యూ అసోసియేషన్ భవనం ఉంది. గతంలోనూ ఈ భవనంలో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నాయని అప్పటి జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్‌కు ఫిర్యాదులందాయి. అప్పటి నుంచి పోలీసులు ఈ భవనంపై ఓ కన్నేసి ఉంచారు. దీంతో ఆదివారం జరిగిన దాడుల్లో ముగ్గురు అడ్డంగా దొరికిపోవడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వివాదాలకు కేంద్రం
జిల్లాలో రెవెన్యూ అసోసియేషన్ తొలి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉంది. తరచూ సంఘ సభ్యులు, ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న కె.రమేష్‌కుమార్‌ను అధ్యక్షుడు సాగర్ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయంపై అప్పట్లో గందరగోళం రేగింది. ఇటీవల అమరావతి జేఏసీ ఏర్పాటు సభ ఏర్పాటు విషయంలోనూ వివాదం తలెత్తింది. అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్, కార్యదర్శి రమేష్ బాహాబాహీకి దిగారు. ఈ వివాదాలను అప్పట్లోనే ’సాక్షి’ బహిర్గతం చేసింది.
ఇప్పటికే సాగర్ సస్పెన్షన్
జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న విద్యాసాగర్ ఏలూరు డెప్యూటీ తహసీల్దారుగా వ్యవహరించేవారు. అయితే రేషన్ డీలర్ల వద్ద నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేకాట ఆడుతూ పట్టుబడడం చర్చనీయాంశమైంది. అతనిపై ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే సాగర్‌తోపాటు పట్టుబడిన కామవరపుకోట తహసీల్దార్ నరశింహారాజును సస్పెండ్ చేసే యోచనలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం.
కేసు నమోదు
పేకాట ఆడుతూ దొరికిన సాగర్, నరసిహారాజు, మార్రాజుపై కేసు నమోదుచేసినట్టు ఏలూరు మూడో పట్టణ ఎస్సై పైడిబాబు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.8వేల 90 స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.