* ఎఫ్‌ఏసీతో బాధ్యతలు అప్పగిస్తున్న వైనం
* కీలకమైన రెవెన్యూలో ఇదీ వరుస
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి వెళ్లాలన్నా... ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా మండలస్థాయిలో పరిష్కరించాలన్నా తహసీల్దార్లే ప్రధానం. రేషన్‌కార్డు మొదలు... కీలకమైన భూ సంబంధ విషయాల వరకూ వీరిదే మండలంలో కీలకపాత్ర. అటువంటి పోస్టుల్లో తహసీల్దార్లను కాదని.... పూర్తిస్తాయి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)పేరుతో డిప్యూటీ తహశీల్దార్(డీటీ)లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కేవలం రెండు, మూడు నెలల కిందట డీటీగా పదోన్నతి వచ్చిన వారికి సైతం ఏకంగా తహ సీల్దారు బాధ్యతలు అప్పగించడంపై రెవెన్యూ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
రెవెన్యూలో కీలకమైన సంస్కరణలు జరుగుతున్న ఈ సమయంలో ఇది మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తహసీల్దార్లు లేరా అంటే అదీ కాదు. అర్హులైన వారు ఉన్నప్పటికీ వారికి ఏ పోస్టింగులు ఇవ్వకుండా డీటీలవైపు మొగ్గుచూపుతున్నారు.
డీటీలో కింగ్‌లు!
జిల్లాలో మొన్నటివరకు ఏకంగా ఏడాది కాలంపాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరంలో డిప్యూటీ తహసీల్దారే తహశీల్దారుగా వ్యవహరించారు. మొన్నటి బదిలీల్లో కూడా ఆళ్లగడ్డ తహసీల్దారును రుద్రవరంకు బదిలీ చేశారు. ఈయన కూడా నాలుగు రోజుల క్రితం వరకూ బాధ్యతలు తీసుకోలేదు. ఇక జిల్లాలో మంత్రాలయం, కోసిగి. ఆళ్లగడ్డ, మద్దికెర మండలాల్లో డీటీలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ) పేరుతో డిప్యూటీ తహసీల్దార్లే... తహసీల్దార్లుగా పని కానిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని మండలాలను డీటీలకు అప్పగించి పనులు కానిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
3 నెలల్లోనే బాధ్యతలా?
డిప్యూటీ తహసీల్దారు(డీటీ)గా పదోన్నతి వచ్చి రెండు, మూడు నెలలైనా కాకముందే వారికి ఏకంగా తహసీల్దారు పోస్టును పూర్తిస్థాయి అదనపు బాధ్యతల పేరుతో అప్పగించడంపైనా రెవెన్యూశాఖలోని వారే నోరెళ్లబెడుతున్నారు. కనీసం డీటీగా కూడా సరియైన అవగాహన లేని వ్యక్తికి ఎఫ్‌ఏసీ ఇచ్చి తహసీల్దారు సీట్లో కూర్చోబెడితే సదరు పోస్టుకు ఏం న్యాయం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలనలో కీలకమైన రెవెన్యూశాఖలో ఇటువంటి ప్రయోగాలు జిల్లాకు ఎంతకూ మంచివికావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తహసీల్దార్లు వద్దు.. డీటీలే ముద్దు
Published Wed, Jul 13 2016 3:29 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement