- గ్రావెల్ కోసం పోలవరం ఎడమ ప్రధాన కాలువకు తూట్లు
- పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
గట్లను మింగేస్తున్నారు!
Published Sun, Oct 16 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
జగ్గంపేట :
జలయజ్ఞంలో భాగంగా తాగు, సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఇందిరా సాగర్ ప్రాజెక్టు(పోలవరం)కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో విశాఖ వరకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు చురుగ్గా జరిగాయి. విశాలమైన కాలువ, గట్లు, శాయిల్ బ్యాంక్‌తో పోలవరం కాలువలు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జలయజ్ఞం ఫలం దక్కుతుంది. కాలువ నిర్మాణంలో వచ్చిన మట్టిని ఇతర అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో ఎవరికివారు తరలించుకుపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, కొందరు స్వార్థపరులు మాత్రం కాలువ గట్లకే తూట్లు పొడుస్తున్నారు. కాలువ గట్లలో గ్రావెల్‌ను పోలిన ఎర్రమట్టి ఉండడంతో.. దానిని రోడ్ల నిర్మాణానికి తరలించుకుపోతున్నారు. పొక్లెయిన్లతో కాలువ గట్లను గుల్ల చేస్తుండడంతో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక దెబ్బతిన్న కాలువల వద్ద గండ్లు పడే అపాయం పొంచి ఉంది. తమ స్వార్థం కోసం గట్లను తవ్వేసి మట్టి తరలించుకుపోతున్నవారు.. కనీసం వేరే మట్టితోనైనా దానిని పూడ్చడం లేదు. దీనిపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగ్గంపేట ప్రాంతంలో కాలువ గట్లకు కనీస రక్షణ లేకుండా పోయింది.
Advertisement