వణుకుతున్న గండికోట | polavaram project gandikota | Sakshi

వణుకుతున్న గండికోట

Feb 20 2017 11:43 PM | Updated on Sep 5 2017 4:11 AM

వణుకుతున్న గండికోట

వణుకుతున్న గండికోట

దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎడమ కాలువ నిర్మాణంతో గండికోట గ్రామం కనుమరుగుకానుంది. గ్రామంలోని గిరిజనులు రెండురోజులుగా బిక్కుబిక్కమంటూ కాలం గడుపుతున్నారు. నిర్వాసితులకు న్యాయపరంగా ప్యాకేజీ చెల్లించకుండానే గ్రామా

బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు 
దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎడమ కాలువ నిర్మాణంతో  గండికోట గ్రామం కనుమరుగుకానుంది. గ్రామంలోని గిరిజనులు రెండురోజులుగా బిక్కుబిక్కమంటూ కాలం గడుపుతున్నారు. నిర్వాసితులకు న్యాయపరంగా ప్యాకేజీ చెల్లించకుండానే గ్రామాన్ని ఖాళీచేసేందుకు అధికారులు అల్టిమేటం జారీ చేయడంతో అర్ధాంతరంగా ఎక్కడికి పోవాలని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పుడొచ్చి మీదపడతారోననే భయందోళనల మధ్య రెండురోజులుగా కూలి పని మానుకుని ఇళ్ల వద్దకాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి వీరికి ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది. ఇవేమీ పట్టనట్టు కంటితుడుపు చర్యగా కొంత మొత్తం చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారు అధికారులు. చట్ట ప్రకారం నిర్వాసితులవుతున్న గిరిజనులకు ఇంటికో ఉద్యోగం, భూమికి భూమి పరిహారంగా ప్రాజెక్టు పరిధిలో భూమిని సేకరించి అందించాలి, నిర్వాసితులకు మెరుగైన కాలనీలు నిర్మించాలి, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలి, గ్రామాన్ని ఖాళీచేసే నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ వర్తింపచేయాల్సి ఉంది.ఇవేమీ చేయకుండా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయాలని హుకుంజారీ చేసి ఆదివారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గిరిజన హక్కులను కాపాడాల్సిన అధికారులే కంచే చేను మేసిన చందంగా వ్యవహరించడంతో అమాయక గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు.  గ్రామంలో 105 ఎకరాల భూమి తీసుకుని రాళ్లుతో నిండిన సాగు యోగ్యంగా లేని కొండభూమి ఇచ్చారు. కొందరికి పాత ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించలేదు. గ్రామంలో హనుమంతుల రామకృష్ణ, కినపర్తి వెంకటకృష్ణ, జమ్మి అర్జున్, జమ్మి శివరామకృష్ణతో పాటు మరో ఇద్దరు యువతులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. వీరికి తల్లిదండ్రులకు చెందిన ఇళ్లు, రేషన్‌కార్డులు ఉన్నా ప్యాకేజీ వర్తింప చేయడంలేదు. కాలనీ నిర్మాణం లేదు. అర్ధాంతరంగా ఊరిని ఖాళీచేస్తే మాకు దారేది, ఎక్కడికి పోవాలని అనాథలు ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి ఐటీడీఏ పీవో వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని సోమవారం రాత్రి 8 గంటల వరకూ ఎదురుచూసిన గిరిజనులకు నిరాశే ఎదురైంది. మధ్యాహ్నం నుంచి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసినా పీవో రాకపోవడంతో రాత్రి వరకూ ఎదురుచూసి వెనుదిరిగి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement