- కొత్త సంవత్సర వేడుకలపై పోలీసుల దృష్టి
- అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బయట కనిపిస్తే కేసులు
- త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ నిషిద్ధం
- ప్రతి విషయం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
అనంతపురం సెంట్రల్ : నూతన సంవత్సర వేడుకల్లో యువత అత్యుత్సాహం ప్రదర్శించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న రాత్రి అనంతపురం నగరంలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటుతాయి. ముఖ్యంగా యువత కోలాహలం అంతా ఇంతా కాదు. టవర్‌క్లాక్ సర్కిల్ విద్యార్థుల కేరింతలతో మార్మోగుతుంది. అయితే.. ప్రతియేటా నగరంలో ఏదో ఒక చోట అపశ్రుతులు దొర్లుతూనే ఉన్నాయి. ద్విచక్ర వాహనాల సైలెంసర్లు తీసి భారీ శబ్దాలతో, అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
మృతి చెందిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది అల్లరిమూకలు ప్రజలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించారు. వీధిలైట్లు ధ్వంసం చేయడం, చెట్లు పెకలించివేయడం, నివాసాలపై రాళ్లు రువ్వడం లాంటి ఆకతాయి చేష్టలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. ఈ సారి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అల్లరిమూకలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా చెల్లుబాటు అయ్యింది.ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదు. నగరంలో ప్రధాన రోడ్లన్నీ సీసీకెమెరాల నిఘా నీడలో ఉన్నాయి. దాదాపు 200 పైచిలుకు సీసీ కెమెరాల ద్వారా అనునిత్యం గమనిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి యువత త్రిబుల్‌రైడింగ్, అతివేగం, సైలెంసర్‌లు తొలగించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయనున్నారు. తాగి వాహనాలు నడిపేవారిపైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తారు.
ఎక్సైజ్ నిర్ణయాలతోనే కష్టం
న్యూఇయర్ సందర్భంగా మద్యం విచ్ఛలవిడిగా విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ఎక్సైజ్‌శాఖ తలుపులు తెరుస్తోంది. సాధారణంగా మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల తర్వాత మూసేస్తారు. అయితే.. డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకూ మద్యం విక్రయాలకు అనుమతులు మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయం పునరావృతమయ్యే అవకాశముంది. దీనివల్ల యువకులు అతిగా మద్యం సేవించి ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది.
ఒంటి గంట తర్వాత కనిపిస్తే కేసులు : మల్లికార్జునవర్మ, డీఎస్పీ, అనంతపురం
నూతన సంవత్సర సంబరాలు ఎవరి ఇంటిలోనూ విషాదం నింపకూడదు. కావున ప్రమాదాలు జరగకుండా యువత సహకరించాలి. తోటి వారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించరాదు. రాత్రి 12 తర్వాత శుభాకాంక్షలు చెప్పుకొని వెళ్లిపోవాలి. ఒంటి గంట తర్వాత కనిపిస్తే నిర్ధాక్షిణ్యంగా కేసులు నమోదు చేస్తాం.
మద్యం షాపులపై ఇంకా నిర్ణయం రాలేదు : అనిల్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్
మద్యం షాపులు మామూలుగా అయితే రాత్రి 10 గంటలకు మూయాలి. డిసెంబర్ 31న మాత్రం గతంలో రాత్రి 12 గంటల వరకూ అనుమతి ఉండేది. దీనిపై ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు.
నిఘా నీడలో.. ‘న్యూ ఇయర్’
Published Thu, Dec 29 2016 11:14 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement