‘కాల్’కేయులపై ఖాకీచకులు! | police fire call money cases | Sakshi
Sakshi News home page

‘కాల్’కేయులపై ఖాకీచకులు!

Published Mon, Dec 21 2015 7:25 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

‘కాల్’కేయులపై ఖాకీచకులు! - Sakshi

‘కాల్’కేయులపై ఖాకీచకులు!

  కేసుల్ని అనువుగా మార్చుకుంటున్న పోలీసులు
  అదుపులోకి తీసుకుంటున్నా కేసుల నమోదులో తాత్సారం
     పెరుగుతున్న కాల్‌మనీ కేసులు
     చట్టం ముసుగులో దందా

 
 ఇటీవల ఓ పోలీస్ అధికారి వాహనం జాతీయ రహదారిపై వెళ్తోంది. ఓ మద్యం ప్రియుడు ఆ.. వాహనానికి అడ్డుతగిలాడు. వెంటనే ఆ అధికారి మద్యం సేవించి రోడ్లపై చిందులేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగుబోతుల నుంచి ఇబ్బందుల్లేకుండా చేయాలన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆ సంఘటనను కిందిస్థాయి సిబ్బంది అనువుగా మార్చుకున్నారు. మందుబాబుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. చట్టం పేరిట బెదిరింపులకు పాల్పడిన ఈ సంఘటన ఆ ఉన్నతాధికారినే ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో మందుబాబుల్ని ఏమీ అనొద్దని సిబ్బందికి చెప్పాల్సి వచ్చింది.
 
 జిల్లాలోని కొన్ని చోట్ల తెల్లకాగితాలపై ముందస్తు సంతకాలు తీసుకుని బాధితులు, ఫిర్యాదీల మధ్య తగాదాలు సెటిల్ చేసే పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారి గుర్తించారు. సివిల్ తగాదాల జోలికి వెళ్లొద్దని, చాలా కేసుల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 41ను దుర్వినియోగం చేస్తున్నారని తేల్చారు. నిందితులకు ఏడేళ్లు దాటి జైలు శిక్ష పడే కేసుల్లోనూ సిబ్బంది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని గుర్తించి సున్నితంగా హెచ్చరించారు. అనంతరం సిబ్బంది కూడా ఆ చర్యల్నీ తమకు అనువుగా మార్చుకుని జేబులు నింపుకునే పనిలో పడ్డారు. మళ్లీ అధికారి హెచ్చరించాల్సి వచ్చింది.
 
 తాజాగా రాష్ట్రాన్ని వణికించేస్తున్న కాల్‌మనీ-సెక్స్ ర్యాకెట్‌పై కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల్నీ సైతం జిల్లా పోలీసులు తమకు కావాల్సిన విధంగా మార్చేసుకుంటున్నారనే ఆరోపణలువస్తున్నాయి. వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ నిర్వహకులు, ఫైనాన్షియర్లు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నది ప్రభుత్వ ఆలోచన. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ సంఘటన రాాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు అనుమానం వచ్చినందరిపైనా విచారణ కొనసాగిస్తున్నారు. దీనివల్ల సాధారణ వడ్డీ తీసుకుంటున్నవారూ ఇబ్బంది పడాల్సివస్తోంది. సరిగ్గా ఇదే పోలీసులకు జేబులు నింపే వనరుగా మారింది.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిబంధనల ప్రకారం ఏడేళ్లు దాటి శిక్ష పడే కేసుల్లోని నిందితులపైనే గట్టిచర్యలు తీసుకోవాల్సి ఉండగా పోలీసులు కొన్ని చోట్ల హద్దు మీరుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నవారి జాబితాను సేకరించి కేసుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 10 కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల వ్యాపారుల ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. వాళ్లందరూ స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీచేయడం, ఫిర్యాదులొస్తే కేసులు పెట్టడం, కొందరికి వెంటవెంటనే బెయిల్ రావడం, మరికొందరికి రాకపోవడం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులూ ఊరుకోవడం లేదని, తమకు అంతో ఇంతో ఇస్తే చర్యలు లేకుండా చూస్తామంటూ జేబులు నింపుకునే పనిలో కొంతమంది ఖాకీలు పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 చర్యలపైనా అనుమానాలు
  విజయవాడ తరహా ఎక్కడా కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ ఉదంతాలు జిల్లాలో లేవు. అయినప్పటికీ ఆర్‌బీఐ నిబంధనల మేరకు అప్పు తీసుకున్నవారి నుంచి ప్రామిసరీ నోట్లు, సంతకాలతో కూడిన ఖాళీ కాగితాలు, స్టాంప్ పేపర్లు ఉండకూడదంటూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేయడం గానీ, కాల్‌మనీ వ్యవహారంపై చట్టం-శిక్ష గుర్చి అవగాహన కల్పించడం గానీ జరగలేదు. అసలు కాల్‌మనీ అంటే ఏమిటి? ఏఏ సెక్షన్లు నమోదు చేయాలి, నిందితులపై తీసుకునే చర్యలేంటనే విషయమై పోలీసులు ఎక్కడా చైతన్య కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇదే విషయాన్ని పోలీసు సిబ్బంది ఆసరాగా తీసుకుని చిన్నచిన్న వడ్డీ వ్యాపారుల్ని వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
 అజ్ఞాతంలోకి వ్యాపారులు
 కాల్‌మనీ పేరిట పోలీసులు వేధింపులకు పాల్పడడం, ఎక్కడ తమపై దాడులు చేస్తారేమోనని భయపడి చాలామంది వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బకాయి వసూళ్లకూ రోడ్లమీదకు రావడం లేదు. ఇళ్లకు తాళాలు వేసేసి మరీ బయట ప్రాంతాల్లో తలదాచుకునేందుకు సిద్ధమైపోయారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాగా, కాల్‌మనీ పేరిట వేధింపులకు పాల్పడుతున్నవారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చెబుతున్నా సిబ్బంది పట్టించుకోకుండా వ్యాపారులను  స్టేషన్‌కు పిలిపించడం, విచారించడం, కాల్‌మనీ కేసులు పెడతామని బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇందుకోసం వేల రూపాయలు చేతులు మారుతున్నట్టు పోలీసు శాఖలోని కొంతమంది సిబ్బంది చెబుతున్నారు.  
 
 ఉపేక్షించేది లేదు
 చట్టాన్ని అతిక్రమించేవారిపై కేసులు తప్పవు. కాల్‌మనీ పేరిట సిబ్బంది దందా చేస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరికైనా అనుమానాలొస్తే నేరుగా నన్నుగాని, లేదా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌మనీ సెంటర్‌ను ఆశ్రయించవచ్చు. అత్యవసర పరిస్థితిలో అత్యవసర విభాగం నెంబర్ 100కు కాల్ చేయవచ్చు. అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తప్పవు.         ఎ.ఎస్.ఖాన్. జిల్లా ఎస్పీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement