అరెస్టుకు రెక్కీ!
ముద్రగడ నివాసంలో పోలీసుల హైడ్రామా
సాక్షి ప్రతినిధి, కాకినాడ / కిర్లంపూడి: ఒకవైపు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం.. మరోవైపు కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం అభిమానులు.. ఆదివారం అంతా వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ముద్రగడ దంపతులను ఏ సమయంలోనైనా అరెస్టు చేసేందుకు వీలుగా పోలీసులు రెక్కీ నిర్వహించారు. అదనపు బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లను, పోలీస్ వ్యాన్లను సిద్ధం చేశారు. ముద్రగడ ఇంటి పరిసరాలను కూలంకషంగా పరిశీలించారు.
ఆదివారం రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ముద్రగడ మద్దతుదారులు, అభిమానులు ప్రతివ్యూహం రూపొందించడంతో కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ముద్రగడ దంపతులు ఈనెల 5న ఆమరణ దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్రగడ సతీమణి పద్మావతి ఆరోగ్య పరిస్థితిపై తొలినుంచీ ఆందోళన వ్యక్తమవుతోంది. దీక్ష తొలిరోజు సాయంత్రానికే ఆమె రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుముఖం పట్టినట్లు పరీక్షలు చేసిన వైద్యులు వెల్లడించారు. అయితే శని, ఆదివారాల్లో వైద్య పరీక్షలకు ముద్రగడ నిరాకరించారు.
ఈ నేపథ్యంలో వారికి వైద్య పరీక్షల నిర్వహణ కీలకాంశం అయ్యింది. ఉదయం నుంచి రెండు దఫాలుగా వైద్య పరీక్షలకు అధికారులు, వైద్య బృందం ప్రయత్నించారు. దీంతో ముద్రగడ ఇంటి రెండు ప్రధాన ద్వారాల తలుపు గడియలు వేయించేశారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డగించడాన్ని, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ద్వారాలు మూసేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనకు సమీపంగా వెళ్లి మాట్లాడే మార్గం అధికారులకు మూసుకుపోయింది. అయితే వైద్య పరీక్షలు నిర్వహించాలని, తలుపులు తీయాలని వారు సాయంత్రం ఆరున్నర గంటలకు ముద్రగడను మరోసారి కోరారు. ఆయన అంగీకరించలేదు. దీంతో పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. ముద్రగడ దంపతులను అరెస్టు చేస్తారేమోనన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న అభిమానులు ఆందోళనకు దిగారు. మూడు ప్రధాన ద్వారాలకు అడ్డంగా వరండాలోకి నాలుగు కార్లు తీసుకొచ్చి నిలిపేశారు. దీంతో తలుపుల దగ్గరకు కూడా ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఏ సమయంలోనైనా అరెస్టు!
ఐజీ కుమార్ విశ్వజిత్, డీఐజీ హరికుమార్ కిర్లంపూడిలోనే మకాంవేసి.. ముద్రగడ దంపతులను ఏ సమయంలోనైనా అరెస్టు చేయడానికి, అప్పుడు తలెత్తే పరిస్థితులను నియంత్రించడానికి అవసరమైన వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ దంపతులపై ఆత్మహత్యాయత్నం (ఐపీసీ 309) కేసు నమోదైందన్న వదంతులు వ్యాపించాయి. ముద్రగడ దీక్ష ప్రారంభించిన తర్వాత ఆయనకు రక్షణగా రాత్రిపూట ఇంటి చుట్టూ నిద్రపోవడానికి కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి, సింహాద్రిపురం, వేలంక, రాజుపాలెం, రామకృష్ణాపురం గ్రామాల నుంచి వందలాది మంది అభిమానులు తరలి వస్తున్నారు. వీరి సంఖ్య ఆదివారం రాత్రి మరింత పెరిగింది.
అడ్డగింతలు.. అరెస్టులు
ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు కిర్లంపూడికి వస్తున్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ప్రత్తిపాడు వద్ద అరెస్టు చేశారు. సామర్లకోట నుంచి వస్తున్న తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను కూడా అడ్డుకున్నారు. రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజులను అరెస్టు చేశారు. ముద్రగడకు సంఘీభావం తెలిపేం దుకు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం కిర్లంపూడికి రానున్నారు. శాసనమండలిలో పార్టీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు తదితరులు కిర్లం పూడికి బయలుదేరుతున్నట్లు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటించింది. తమ నేతలు కాపు ఉద్యమ నేతను కలుసుకుని తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలు కూడా సోమవారం కిర్లంపూడికి రానున్నట్లు సమాచారం. వీరు కిర్లంపూడికి చేరకుండా మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నేతలను అడ్డుకుని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే నిలిపివేసేందుకు వీలుగా వ్యూహం రచించినట్లు తెలిసింది.
ఉద్యమం ఉధృతం
కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమం ఆదివారం మరింత ఉధృతమైంది. కిర్లంపూడి, సింహాద్రిపురం, జగపతినగరంలలో ముద్రగడ అభిమానులు టెంట్లు వేసుకుని దీక్షలు ప్రారంభించారు. కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష చేస్తున్న ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున మహిళలు బైఠాయించారు. ఖాళీప్లేట్లు పట్టుకుని శబ్దం చేస్తూ నిరసన తెలిపారు. వంద మందికి పైగా యువకులు ముద్రగడ ఇంటి ముందు చెవిలో పూలతో బైఠాయించి ‘సీఎం డౌన్...డౌన్, హోం మంత్రి రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేశారు. కొందరు నిరసన నినాదాలు చేస్తూ కబడ్డీ ఆడారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చే యడానికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.