నా శవాన్నే తీసుకెళ్లండి..
- బంధువుల వద్ద ముద్రగడ నిర్వేదం
- గుండె సంబంధ సమస్య తలెత్తడంతో వైద్యుల కలవరం
-11వ రోజు కొనసాగిన ఆమరణ దీక్ష
- అరుునా మారని సర్కారు వైఖరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్య మెందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికీ తీసుకెళ్లొద్దు. తీసుకు వెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి’ అంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం వైద్యులు, బంధువుల వద్ద నిర్వేదం వ్యక్తం చేశారు. ఆరోగ్య పరీక్షలకు, రక్త నమూనాలు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ముద్రగడకు 101 డిగ్రీల జ్వరం ఉంది. గుండె సంబంధిత సమస్య తలె త్తడంతో వైద్యులు కలవరపడుతున్నట్టు సమాచారం.
తుని ఘటనలో అరెస్ట్ అయిన 13 మందిలో మిగిలిన ముగ్గురు బయటకు రావడంలో జరుగుతున్న జాప్యం వల్ల ముద్రగడ వైద్యం చేరుుంచుకోడానికి నిరాకరిస్తున్నారు. ముద్రగడను చూసేందుకు వెళ్లిన చల్లా సత్యనారాయణ సహా ముగ్గురు సన్నిహితులు బయటకు వచ్చాక తీవ్రంగా కలతచెందారు. ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి వైద్యులు, బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం చాలా కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.
ముద్రగడకు ముప్పు తేవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు కుటుంబ సభ్యులను అడగడంతో వారు కూడా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. బంధువులతో సైతం ముద్రగడ ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులు, కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముద్రగడ డిమాండ్లను అంగీకరించినట్లు ప్రకటించి, తర్వాత మాట మార్చి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. సాక్షి సహా పలు చానళ్ల ప్రసారాలు నిలిపేసి మీడియా గొంతు నొక్కి.. కాపుల ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణగదొక్కడం చూస్తుంటే ముద్రగడను భౌతికంగా లేకుండా చేయాలని చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందనిపిస్తోందన్నారు.
వాస్తవం చెప్పడం లేదు..: ముద్రగడ సతీమణి పద్మావతికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె సోదరుడు గొల్లపల్లి కాశీవిశ్వనాథ్‌ను శనివారం అర్ధరాత్రి దాటాక హుటాహుటిన ఆస్పత్రికి పిలిపించారని సమాచారం. ఏ క్షణమైనా అవసరం రావచ్చని ముద్రగడ గదికి సమీపాన అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు.
అమాయకుల్ని ఇరికించారు
తుని ఘటనలో సెల్ సిగ్నల్ ఆధారంగా నమోదైన కేసుల్లో సంబంధం లేని వారిని సైతం ఇరికించారనే విషయం స్పష్టమైంది. పిఠాపురానికి చెందిన శ్రీహరిబాబు లారీ డ్రైవర్. అతను తన యజమాని లారీ కిరాయి కోసమని కాపులను తీసుకువెళ్లాడు. వారు ఏడుగంటలైనా రాకపోవడంతో తన ఫోన్ నుంచి కాల్ చేశాడు. అదే అతను చేసిన తప్పు. దీంతో అతడిని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. బెయిల్ లభించినా సీఐడీ కస్టడీకి తీసుకున్న లగుడు శ్రీను కాపు ఉద్యమంతో సంబంధం లేని వైఎస్సార్ సీపీ నేత. టీడీపీ నేతల ఒత్తిడి వల్లే ఇతన్ని కేసులో ఇరికించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలా చాలా మందిపై కేసులు నమోదు చేశారు.
కొనసాగిన కాపుల ఉద్యమం
ముద్రగడ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పి.గన్నవరం, కొత్తపేట, గేదెల్లంక, మెట్ట ప్రాంతంలో జగ్గంపేట, ఏలేశ్వరం, సామర్లకోట, కడియపుసావరం తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
అవసరమైతే నేటి ఉదయం తరలింపు : బాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): తన తండ్రి ఆరోగ్యం ఆదివారం ఉదయం నుంచి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, రాత్రి 11 గంటలకు వైద్య పరీక్షల అనంతరం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు తెలిపారు. సోమవారం ఉదయం పరీక్షల అనంతరం అవసరమైతే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తారన్నారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి పద్మావతి ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. తొలుత మెరుగైన వైద్యం కోసం తన తండ్రిని వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారని, ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండడం వల్ల ఇక్కడే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు.