వైఎస్సార్‌సీపీ నేతల అడ్డగింత
- ముద్రగడను పరామర్శించేందుకు ససేమిరా
- మధురపూడి విమానాశ్రయంలోనే అరెస్టు
సాక్షి, రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం మధురపూడి విమానాశ్రయం చేరుకున్న పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, పార్టీ సీజీసీ సభ్యుడు, శాసనమండలిలో ప్లోర్‌లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీఅధికారప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయబాను, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పినిపే విశ్వరూప్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ముద్రగడ వద్దకు ఎవ్వరినీ పంపవద్దని తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, కలెక్టర్ పంపిన ప్రతిని చూపించారు. చివరికి వెనక్కి వెళ్లాలనే నిబంధనతో సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. చంద్రబాబు పాలన అరాచకమయంగా ఉందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో బొత్స మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వస్తే అరెస్ట్ చేసి కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ఉంచడం దారుణమన్నారు.