డ్రగ్స్‌కు అడ్డగా సింహపురి
-
విభిన్న కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు
-
పోలీసుల అదుపులో ముగ్గురు?
నెల్లూరు (క్రైమ్) : నెల్లూరులో డ్రగ్స్ మాఫియా జాడలు తీవ్ర కలకలం రేకెత్తిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో సూత్రదారులను గుర్తించేందుకు నగర పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసులు స్వా«ధీనం చేసుకున్న కెటామైన్ మత్తు పదార్థం ఎక్కడ నుంచి సరఫరా అవుతుందో వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు శ్రీహరిరెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆదివారం అరెస్ట్ చేశారు. ముత్తుకూరు మండలం కొట్లపాడుకు చెందిన శ్రీహరిరెడ్డి కొన్నేళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చాడు. సంతపేట కామాక్షినగర్‌లో నివాసముంటూ నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ సమీపంలోని తన బావ రవిరెడ్డి టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విభిన్న వర్గాలకు చెందిన పలువురితో ఆయనకు పరిచయం ఏర్పడింది. రైల్వేస్టేషన్‌తో పాటు పరిసరాల్లో చిల్లర మల్లరగా తిరిగే వారితో స్నేహం పెంచుకున్నాడు. అతనికి రైల్వేస్టేషన్ వద్ద నివాసముండే ఇద్దరు యువకులతో బాగా సానిహిత్యం పెరిగింది. వారు అనేక వస్తువులు రవిరెడ్డి ద్వారా అమ్మేవారు. కొంత కాలం కిందట శ్రీహరిరెడ్డి తన బావవద్ద పని మానివేశాడు. లస్సీసెంటర్‌లో లీజుకు ఓ టీ కొట్టును తీసుకుని నిర్వహించసాగాడు. వరికుంటపాడుకు చెందిన కె. సురేష్ కొన్నేళ్లు బీవీనగర్‌లో ఉండి ప్రస్తుతం హైదరాబాద్ మణికొండలో ఉంటున్నాడు. అతనికి కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్మల కిశోర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో సినిమా రంగంలో ఉంటున్నారు. శుక్రవారం హైదరాబాద్ జీడిమెట్ల పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సురేష్, కిశోర్ వెళ్తున్న బైక్‌ను తనిఖీ చేయగా కెటామైన్ అనే మత్తు పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నెల్లూరుకు చెందిన శ్రీహరిరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీకి సమాచారం అందించారు. శ్రీహరిరెడ్డి డ్రగ్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించాలని ఆయన రెండో నగర పోలీసులను ఆదేశించారు. పోలీసులు శనివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద శ్రీహరిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మత్తుపదార్థం ఎలా వచ్చిందని విచారించగా రైల్వేస్టేషన్ వద్ద నివాసముండే ఇద్దరు యువకులు తనకు తెచ్చి ఇచ్చారని ఆయన పోలీసు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
మూడునెలల కిందట..
మూడు నెలల కిందట ఆ ఇద్దరు యువకులకు రైల్వేస్టేషన్‌లో సుమారు 3 కేజీల కెటామైన్ ఉన్న కవర్ దొరికినట్లు తెలిసింది. దానిని విప్పితీయగా అది తెల్లని పొడిగా ఉండటంతో రుచి చూడగా మత్తుగా ఉండటంతో వారు ఆ కవర్‌ను శ్రీహరిరెడ్డికి ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచి దానిని అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా ఫలించలేదు. తనకు పరిచయం ఉన్న సురేష్ (సినీనిర్మాత)కు సినీ పరిశ్రమలో పెద్దస్థాయిలో పలుకుబడి ఉంటుందని, అతని ద్వారా కెటామైన్‌ను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శ్రీహరిరెడ్డి ఆ కవర్‌లోని సగ భాగం అతనికి అప్పగించగా, సురేష్ అతని స్నేహితుడు కిశోర్ హైదరాబాద్‌లో జీడిమెట్ల పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో శ్రీహరిరెడ్డి బండారం బయటపడినట్లు తెలుస్తోంది.