ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి
పాత్రికేయుల డిమాండ్
రాజమహేంద్రవరం క్రైం :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా గురువారం టీవీ 5 విలేకరి సురేష్‌పై త్రీ టౌన్ ఎస్సై రామ్మోహనరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ దాడి చేయడాన్ని రాజమహేంద్రవరం పత్రికా విలేకరుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడిచేసిన కానిస్టేబుల్, ఎస్సైలను సస్పెండ్ చేయాలని కోరుతూ శుక్రవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణకు జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. 48 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకోకుంటే దశలవారీ ఆందోళన చేపడతామని వారు ప్రకటించారు. కృష్ణా పుష్కరాల డ్యూటీలో ఉన్న అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారికి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వారు ఫోన్‌లో తెలియజేశారు. విలేకరులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె వారికి హామీ ఇచ్చారు. తొలుత వివిధ పత్రికా విలేకరుల సంఘాలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా పాత్రికేయులు, వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లు సమావేశం నిర్వహించారు.
కేసుల నమోదు
ఉభయులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు త్రీటౌన్ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి టీవీ 5 విలేకరి సురేష్‌పై దాడికి సంబంధించిన ఫిర్యాదును స్వీకరించామన్నారు. అలాగే కోటగుమ్మం సెంటర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ విధులకు ఆటంకం కల్గించి దాడికి పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదును కూడా స్వీకరించామన్నారు. ఉభయులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులను నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.