పోలీసులది ప్రేక్షకపాత్రే..
Published Wed, Jul 20 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
జిల్లా ఎస్పీకి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫిర్యాదు
కొత్తపేట/ఆత్రేయపురం : జాతీయ నాయకుల విగ్రహాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, వాటిని ధ్వంసం చేసిన కేసులను నీరుగారుస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ఆయా కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ మేరకు కాకినాడలో ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆత్రేయపురంలో మంగళవారం ఆయ న విలేకరులకు తెలిపారు. కొత్తపేట మండలం లో మోడేకుర్రు, గంటి, వానపల్లి, ఆత్రేయపురం మండలంలో వెలిచేరు, బొబ్బర్లంక గ్రామాల్లో, రావులపాలెం మండలంలో పొడగట్లపల్లి, ఆల మూరు మండలంలో గుమ్మిలేరు గ్రామాల్లో అం బేడ్కర్ విగ్రహాలకు అవమానాలు జరిగాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు కేసుల నమోదుతో సరిపెట్టారు మినహా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేడ్కర్ విగ్రహాలకు అవమానాలు జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో కాపు నాయకుడు దివంగత వంగవీటి మెహనరంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి, అవమానపరిచిన కేసులో పోలీసులు ఇంతవరకూ దోషులను పట్టుకోలేక పోయారని విమర్శించారు. ఆయా అంశాలపై జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు దళిత నాయకులతో కలసి ఫిర్యాదు చేశామన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, పలువురు దళిత నాయకులున్నారు.
Advertisement