- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
- వైఎస్సార్ సీపీ తరఫున రూ. 21 వేల ఆర్థిక సాయం
బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
Published Thu, Apr 20 2017 11:55 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
తాడితోట (రాజమహేంద్రవరం)/ ఆత్రేయపురం:
ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో గాయాల పాలైన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 15 మందిని గురువారం ఆయన రాజమహేంద్రవరం హాస్పటల్‌లో పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు రూ. 21 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు పరామర్శకు వచ్చిన మంత్రులు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వాగ్దానం చేసి మర్చిపోతున్నారన్నారు. రెండేళ్ల క్రితం జొన్నాడలో గోదావరి గేట్లు ఎత్తివేసినప్పుడు ముగ్గురు మృతి చెందారని, వారి కుటుంబాలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఆ హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇప్పటి వరకూ బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో గాయ పడిన, ప్రాణాలు కోల్పోయినవారు 4 వేల మంది వరకూ ఉంటారన్నారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకూ ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదన్నారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని అన్నారు. ర్యాలి ప్రమాద బాధితులందరూ కూలీలు కనుక వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రావులపాలెం ఎంపీపీ కోట బాలయ్య, ర్యాలి ఎంపీటీసీ సభ్యు డు బోణం సాయిబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మెర్ల వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగి రెడ్డి, ఆత్రేయపురం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ముప్పిడి పండు, ప్రధాన కార్యదర్శి తలపాకుల మోహన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కాకినాడలోని ప్రముఖ వైద్యశాలకు తరలించినట్టు ఆత్రేయపురం మండలం ఉచ్చిలిలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తెలిపారు.
Advertisement