ఫుట్‌బాల్ ఆడుతున్న విద్యార్థులు
– కార్యదర్శి ఎంపికలో డీఈవోపై అధికార పార్టీ ఒత్తిడి
– కలెక్టర్ నుంచి డీఎస్‌డీవోకు చేరిన ఎంపిక ఫైల్
– ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిన డీఎస్‌డీవో
– స్కూల్ గేమ్స్ దగ్గర పడుతున్నా పూర్తిగాని క్రీడాకారుల ఎంపిక
తిరుపతి సెంట్రల్:
పీవీ.సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ‘ఆ గొప్ప నాది అంటే నాది’ అంటూ మన నాయకులు చేసిన ఆర్భాటం నిన్నమొన్నటి వరకు చూశాం. క్షేత్ర స్థాయిలో ప్రోత్సహిస్తే ఇలాంటి సింధులు ఎంతోమంది పుట్టుకొస్తారనే విషయం తెలిసినా ఏ నాయకుడూ ఆ దిశగా చర్యలు తీసుకోరు. స్కూల్ గేమ్స్ విషయంలో జిల్లా నాయకులు వ్యవహరిస్తున్న తీరే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
తిరుపతి ఎంఆర్‌పల్లికి చెందిన మంజు గత ఏడాది రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. మహారాష్ట్రలో నిర్వహించిన 62వ స్కూల్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. అంతటి ప్రతిభావంతురాలు ఈ నెల 12 నుంచి గన్నవరంలో నిర్వహించనున్న స్కూల్‌గేమ్స్ రెజ్లింగ్ స్టేట్‌మీట్‌లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇంతవరకు జిల్లా క్రీడాజట్టును ఎంపిక చేయకపోవడమే. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి జిల్లాలో స్కూల్ గేమ్స్‌లో పాల్గొనాలని అనుకున్న క్రీడాకారులకు ఆశాభంగం తప్పలేదు.
కార్యదర్శినే ఎంపిక చేయలేదు..
గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న నిరుపేద క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికోసం జిల్లాకో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిని డీఈవో ఎంపిక చేయాలి. కార్యదర్శి నేతత్వంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభగల పేద క్రీడాకారులను గుర్తించి, స్కూల్ గేమ్స్‌కు జిల్లా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. 2016–17 విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇంతవరకు కార్యదర్శిని ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కార్యదర్శి పోస్టుకు జిల్లా నుంచి దాదాపు 10 మంది పీఈటీలు పోటీపడుతున్నారు. ఈ పోస్టుకు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తేవడంతో ఎంపిక ఆలస్యమయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నష్టపోతున్న క్రీడాకారులు..
స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లేకపోవడంతో ఈ ఏడాది ప్రతిభగల క్రీడాకారులు నష్టపోతున్నారు. సాధారణంగా స్కూల్ గేమ్స్‌కు 15 నుంచి 20 రోజుల ముందు అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి పేద క్రీడాకారులను ఎంపిక చేస్తారు. వారి సర్టిఫికెట్లు పరిశీలించి కార్యదర్శి సంతకం చేస్తేనే రైల్వే కన్సెషన్ ఫాం వర్తిస్తుంది. అంతా ఓకే అయ్యాక క్రీడాకారులకు కనీసం రెండు వారాలైనా శిక్షణ ఇవ్వాలి. గన్నవరంలో ఈ నెల 12 నుంచి జరిగే స్కూల్ గేమ్స్ పంపించాలంటే 11వ తేదీన అక్కడికి చేరుకోవాల్సిన జిల్లా రెజ్లింగ్ జట్టును ఇంతవరకు ఎంపిక చేయలేదు.
పేద క్రీడాకారులపై వివక్ష..
జిల్లాకు వన్నె తెస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం విస్మరిస్తోంది. గత ఏడాది రెజ్లింగ్‌లో జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన క్రీడాకారులను గుర్తించడంలేదు. పేద క్రీడాకారులు వారి సొంత ఖర్చులతో పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా ఎంపిక చేయలేదు. తక్షణమే కలెక్టర్ చొరవ తీసుకోవాలి.
– చీనేపల్లి కిరణ్‌కుమార్, కార్యదర్శి, జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ, తిరుపతి.