
షేమ్..షేమ్..!
‘కంచే చేనును మేసింది’ అన్న చందంగా చట్టాన్ని రక్షించాలి్సన అధికారులు అక్రమార్కులకు వంతపాడుతున్నారు.
♦ పోలీసు వ్యవస్థకే మచ్చగా పోరుమామిళ్ల కిడ్నాప్ వ్యవహారం
♦ కేసు విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా ముర్తుజా కుటుంబీకులపై ఒత్తిడి
♦ విడుదల చేస్తారని నమ్మబలకడంతో కేసు ఉపసంహరణ
♦ ఆపై ఎంపీటీసీ డాక్టర్ గౌస్‌పీర్ మిస్సింగ్ కేసు ఇవ్వాలని సిఫార్సులు
♦ తప్పుడు కేసు ఇవ్వలేమని తేల్చిచెప్పిన కుటుంబసభ్యులు
♦ ఎట్టకేలకు మైదుకూరు డీఎస్పీ కార్యాలయం చెంత వదిలేసిన వైనం
♦ కిడ్నాప్‌లో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పండిస్తున్న సీఐ పద్మనాథన్
‘కంచే చేనును మేసింది’ అన్న చందంగా చట్టాన్ని రక్షించాలి్సన అధికారులు అక్రమార్కులకు వంతపాడుతున్నారు. ఎన్నికల కోడ్‌ను
సైతం విస్మరిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నారు. విపరీతమైన రాజభక్తి చూపుతున్నారు. బాధితుల పక్షాన నిలవాలి్సన వారు అందుకు విరుద్ధంగా నిందితులకు సహకరిస్తున్నారు. పోరుమామిళ్ల కిడ్నాప్ వ్యవహారం అందుకు నిదర్శనం. పోలీసు శాఖకు జిల్లాలో మాయనిమచ్చగా ఈ ఉదంతం మారనుంది.
సాక్షి ప్రతినిధి, కడప: పోలీసుశాఖను పోరుమామిళ్ల కిడ్నాప్ వ్యవహారం కుదిపేస్తోంది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు విశేషకృషి చూపిన ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వింత అనుభవం ఎదురైంది. ఉన్నతాధికారి ఎంత నిక్కచ్ఛిగా ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఏకపక్ష వైఖరి కారణంగా పోలీసుశాఖ పరువు గంగలో కలిసిందని పోరుమామిళ్లవాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఘటన స్థలంలో లభించిన ఆధారాలతో చాలెంజ్‌గా తీసుకోని కిడ్నాప్‌ను ఛేదించాలి్సన అధికారులు ఏకంగా ఉన్నతాధికారులనే తప్పుదోవ పట్టించారు. పైపెచ్చు బాధితులను వేధింపులకు గురిచేశారని పలువురు వివరిస్తున్నారు.
కిడ్నాప్‌ను రక్తికట్టించిన సీఐ
పోరుమామిళ్లలో దొమ్మిలు, దౌర్జన్యాలు, పరస్పర దాడులాంటివి బహు అరుదు. అలాంటి ప్రాంతంలో మునుపెన్నడూ లేనివిధంగా కిడ్నాప్ ఘటన. అందులో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి బాధితుడు. ఒక్కమారుగా తీవ్ర ఉత్కంఠత రేగింది. ఈ వ్యవహారంలో స్వయంగా పోలీసు అధికారి తెరవెనుక పాత్ర పోషించడం విశేషం. బాధితుల కథనం మేరకు... పోరుమామిళ్ల కిడ్నాప్ వ్యవహారంలో సీఐ పద్మనాథన్ తన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో రక్తికట్టించారు. ఎంపీటీసీ డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడు ముర్తుజా హుస్సేన్ కిడ్నాప్ ఘటనలో సెల్‌ఫోన్ లభించింది. సీసీ కెమెరా పుటేజీల్లో వా హనాలు స్పష్టంగా కన్పించాయి. వాటి ఆధారంగా రాత్రికిరాత్రే కేసును ఛేదిం చాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు లేవు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.
ప్రతిగా టీడీపీ నేతలు సైతం ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. ఆపై అటు నిందితులు నేరుగా ముర్తుజాహుస్సేన్ తో తల్లి, సోదరుడితో ఫోన్ లో మాట్లాడించారు. అనంతరం బాధితులపై సీఐ పద్మనాథన్ ఒత్తిడి పెంచారు. కేసు విత్‌డ్రా చేసుకోండి, కిడ్నాప్‌నకు గురైన ముర్తుజాహుస్సేన్ ను వదిలిపెడతారంటూ పదేపదే ఒత్తిడి చేస్తూ వచ్చారు. మరోవైపు కడప నగరానికి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ సెల్‌ఫోన్ నుంచి టీడీపీ ముఖ్యనేత, తదితరులు సైతం ముర్తుజా సోదరుడు ముజీబ్‌తో మాట్లాడారు.
వెంటనే కేసు ఉపసంహరించుకోండి, మీవాడు మీఇంటికి చేరతాడని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు వెంటనే కేసు విత్‌డ్రా చేసుకోమని ముర్తుజా నుంచి పదేపదే ఫోన్లు చేయించారు. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య కేసును బుధవారం రాత్రి కేసు ఉపసంహరించుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో నిందితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ ఉదంతాన్ని సీఐ పద్మనాథన్ బాగా రక్తికట్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మిస్సింగ్ కేసు నమోదు చేయాలి
బుధవారం రాత్రి వరకూ కిడ్నాప్ కేసు ఉపసంహరించుకోవాలి్సందిగా ఒత్తిడి పెంచిన నిందితులు, టీడీపీ నేతలు కేసు ఉపసంహరించుకున్నాక కొత్త నాటకానికి తెరలేపారు. గురువారం ఉదయం నుంచి ఎంపీటీసీ డాక్టర్ గౌస్‌పీర్ మిస్సింగ్ అయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తర్వాతే మీ తమ్ముడు ఇంట్లో ఉంటారంటూ ముజీబ్‌కు ఫోన్ లో బెదిరింపులు మొదలయ్యాయి. ఇక ముర్తుజాతో ఫోన్ లో మాట్లాడనీయకుండా మేము చెప్పినట్లు వింటే మీ తమ్ముడు ఇంటికి వస్తాడు, అంతకు పదింతలు సహాయం చేయగలం, వెంటనే మిస్సింగ్ కేసు పెట్టండి అంటూ హుకుం జారీ చేశారు.
మీరు చెప్పినట్లు కేసు ఉపసంహరించుకున్నాం, మళ్లీ మమ్మల్ని సతాయించడం ఎంతవరకూ న్యాయం అంటూ వాపోయినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేస్తారా, మీ తమ్ముడి తల ఓచోట, కాళ్లు చేతులు మరోచోట చూస్తారా.. అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఈ దశలో ముజీబ్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక లాభం లేదని భావించిన దుండగులు సాయంత్రం మైదుకూరు డీఎస్పీ కార్యాలయం చెంతన ముర్తుజాను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. కాగా కిడ్నాప్ కేసు ఎఫ్‌ఐఆర్ నేపథ్యంలో ముర్తుజాహుస్సేన్ ను బద్వేల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బంధువులకు అప్పగించే ప్రక్రియలో పోలీసు యంత్రాంగం ఉంది.
తలదించుకునే పరిస్థితులు
ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం తలదించుకోవాలి్సన పరిస్థితులను కిందిస్థాయి యంత్రాంగం కల్పిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు నిక్కచ్ఛిగా వ్యవహరిస్తున్నా ఎన్నికల కోడ్‌కు సైతం తిలోదకాలిచ్చి కొందరు అధికారులు ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
కార్పొరేటర్లు ఎంఎల్‌ఎన్ సురేష్‌బాబుపై దాడి, పాకా సురేష్‌పై హత్యాయత్నం, ఎర్రగుంట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బారెడ్డిపై దాడి, ముద్దనూరు జెడ్పీటీసీ భగీరథమ్మ ఆస్తులు ధ్వంసం, పోరుమామిళ్ల కిడ్నాప్‌లాంటి వరుస ఘటనలతో పోలీసు ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోయాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా, అధికారపార్టీ అనే ఉదాసీనతను చూపుతుండడంతో శాఖపరంగా పరువు మంటగలుస్తోందని పలువురు చెప్పుకొస్తున్నారు.