కలెక్టర్ ఫోన్తో నిండు గర్భిణీకి వైద్యం | Pregnant Woman Giving Birth in ckm Hospital | Sakshi
Sakshi News home page

కలెక్టర్ ఫోన్తో నిండు గర్భిణీకి వైద్యం

May 11 2016 9:16 AM | Updated on Sep 3 2017 11:53 PM

కలెక్టర్ ఫోన్తో నిండు గర్భిణీకి వైద్యం

కలెక్టర్ ఫోన్తో నిండు గర్భిణీకి వైద్యం

ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా గేటు బయటకు గెంటేసిన సంఘటన వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వరంగల్ : ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా గేటు బయటకు గెంటేసిన సంఘటన వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున  చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది దాష్టీకం కారణంగా సుజాత అనే నిండు గర్భిణి చలికి వణుకుతూ తెల్లవారేవరకూ ఆస్పత్రి మెట్లపైనే కూర్చుంది. దాంతో ఆమె బాగా నీరసించింది. ఈ విషయంపై గర్భిణి బంధువులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి.. సదరు ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేయడంతో మూడు గంటల తర్వాత ఆమెకు వైద్యం అందించారు. సిజేరియన్ చేసి బిడ్డను వెలికి తీశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు... ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన సుజాత అనే మహిళకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ప్రసవం కోసం కుటుంబసభ్యులు బుధవారం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు.

అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోకుండా గేటు బయటకు గెంటేశారు. కుటుంబసభ్యులు ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. ఈ విషయంపై డీఎం అండ్ హెచ్‌ఓకు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. ఆ తర్వాత కలెక్టర్‌కు ఫోన్‌చేయడంతో కలెక్టర్ స్పందించి గర్భిణిని వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు. దాంతో గాబరాపడిన ఆస్పత్రి సిబ్బంది సుజాతను ఆస్పత్రి లోనికి తీసుకెళ్లి వైద్యం అందించారు. సిజేరియన్ చేసి కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

సుజాత కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గతంలో చికిత్సపొందింది. ఆమెకు మలేరియా జ్వరంతో పాటు కామెర్లు సోకడంతో మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రి రెఫర్‌చేశారని వరంగల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే ఆమె తెల్లవారుజామున ఇక్కడికి వచ్చిందని... ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సీకేఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో తాము హైదరాబాద్ వెళ్లమని సూచించామని చెప్పారు.

కాగా ఆమె హైదరాబాద్ వెళ్లకుండా ఆస్పత్రి మెట్లపైనే కూర్చుందని వారు చెబుతున్నారు. సుజాత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ పోయేలోగా ఏదైనా ప్రమాదం సంభవించవచ్చన్న భయంతో ఇక్కడే చేర్చుకుని వైద్యం చేయమని తాము వేడుకున్నా సిబ్బంది కనికరించలేదని సుజాత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు తాము కలెక్టర్‌కు ఫోనే చేయాల్సి వచ్చిందని వారన్నారు. కలెక్టర్ జోక్యంతో సుజాత పండంటి మగబిడ్డకు జన్మఇచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది వ్యవహార తీరుపై చాలా విమర్శలు ఉన్నాయి. పదిరోజుల క్రితం కూడా కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement