కన్నుమూసిన కలను కడుపున మోస్తూ
ఐదు రోజులుగా మృతశిశువును కడుపులో ఉంచుకుని అవస్థలు
కుటుంబీకుల ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి సిబ్బంది
కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి తీవ్ర అవస్థలకు గురైంది. తన కడుపులోని శిశువు చనిపోయాడని ఒకసారి.. తర్వాత బయటకు వస్తుందని మరోసారి చెప్పి ఐదు రోజులు నిర్లక్ష్యంగా వదిలేశారు. బాధితురాలి ప్రాణం మీదకు వచ్చేసరికి› కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుటుంబీకులతో సహా పలువురు ఆందోళన చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం చికిత్స ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని క్వారీ ప్రాంతానికి చెందిన కొల్లి వెంకటేశ్వరి రెండోకాన్పు చేసుకునేందుకు తన భర్త సతీష్‌తో కలిసి ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్ధిని ఆమెను మర్నాడు రమ్మని చెప్పి పంపించివేసింది. శనివారం ఉదయం వచ్చిన వెంకటేశ్వరికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ విష్ణువర్ధిని కడుపులో బిడ్డ చనిపోయిందని సాయంత్రం రమ్మని మళ్లీ పంపేశారు.
మళ్లీ సాయంత్రం వచ్చిన వెంకటేశ్వరిని ఆస్పత్రిలో చేర్చుకుని నార్మల్ డెలివరీ అవుతుంది కంగారుపడకు అని చెప్పి వదిలేశారు. తర్వాత ఆది, సోమ, మంగళ వారాలు గడిచి బుధవారం వచ్చిందేకాని కడుపులో మృతశిశువు బయటకు రాలేదు. డాక్టర్ విష్ణువర్ధిని సెలవుపై వెళ్లడంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి డాక్టర్ వసుంధర వద్దకు వారు వెళ్లి విష్ణువర్ధిని రాసిచ్చిన మందులను ఆమెకు చూపారు. వాటిని ఆమె విసిరేసి వీటితో డెలివరీ అవ్వదు.. కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిపొమ్మని, లేకపోతే తల్లికి ప్రమాదమని చెప్పారు. దీంతో విషయాన్ని కుటింబీకులకు తెలపడంతో స్థానిక నాయకులు దాస్య ప్రసాద్, కందికొండ రమేష్,› వానపల్లి శంకర్, అజ్జరపు వాసు తదితరులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ పద్మశ్రీ వచ్చి జరిగిన విషయం తెలుసుకుని కుటుంబీకులతో మాట్లాడి చికిత్స రాజమహేంద్రవరంలోనే అందిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.