‘సొంత ఆస్తుల్లా అమ్మేస్తున్నారు’
సూళ్లూరుపేట : పట్టణం నడిబొడ్డున ఉన్న పరిశుద్ధ మిఖాయేల్ లూథరన్ చర్చికి చెందిన ఆస్తులను చర్చికి పాస్టర్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ తన సొంత ఆస్తుల్లా అమ్మేస్తున్నారని క్రిస్టియన్ మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం గౌరవాధ్యక్షుడు ఆవుల ప్రసాదరావు అన్నారు. ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా ఫోరం ఆధ్వర్యంలో చర్చి ఎదురుగా పట్టణంలోని క్రైస్తవులు ఆందోళన చేశారు. పాస్టర్ చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం జర్మనీ దేశస్తులు చర్చి నిర్మించి దానికి స్థానిక వినాయకుడిగుడి సెంటర్ నుంచి ఆర్‌ఆండ్‌బీ బంగ్లా వరకు ఆస్తులు కూడా సమకూర్చారన్నారు. చర్చి కాంపౌండ్‌లో ఓ ప్రాథమిక పాఠశాల ఉంటే దాన్ని అమ్మేశారని, దాని పక్కనే ఉన్న స్థలాలను ఒక్కొక్కటిగా అమ్మి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఇప్పుడు చర్చికి పక్కనే ఉన్న సమాధులను కూడా అమ్మేసేందుకు సిద్ధమైపోయారన్నారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించి ఇందులో ప్రమేయమున్న వారు ఎంతటివారైనా సరే శిక్షించి క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. లీగల్ అడ్వజర్, హైకోర్టు న్యాయవాది కృష్ణ, క్రిస్టియన్ ఫోరం నాయకులు డేవిడ్ వాగ్దేవ్, మెనార్డ్, ఫిలిప్, ప్రకాష్, చంద్రయ్య, సత్యానందం, రాజానందం, ఎంపీ సుందరం, మదన్, అంబేడ్కర్ సేవా సమితి అధ్యక్షుడు పిట్ల చిన్న పాల్గొన్నారు.