ఇక్కడంతా 'గణాంకాల' పాలనే !
– ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువైంది
– సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత తీవ్రం
– ఎన్‌హెచ్‌ఎం సభ్యుల ముందు సమస్యల ఏకరువు
అనంతపురం మెడికల్ : 'ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మెడికల్ ఆఫీసర్లు లేరు. స్టాఫ్‌నర్సుల కొరత ఉంది. ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు. ఇన్‌పేషెంట్స్, ఔట్‌పేషెంట్స్ పెరుగుతున్నారు. ప్రసవాలు, పుట్టిన బిడ్డకు బేబీ కిట్స్ అందజేయడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ డేటాబేస్డ్ పాలన సాగుతోంది. గణాంకాలన్నీ 24 గంటల్లోనే పంపాల్సి వస్తోంది' అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమస్యలను ఏకరువు పెట్టారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) సభ్యులు డాక్టర్ లేఖ, డాక్టర్ ప్రభుస్వామి జిల్లాకు చేరుకుని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అధికారులతో సమావేÔ¶మయ్యారు. ముందుగా జిల్లాలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే సమస్యలన్నింటినీ ఆయా విభాగాల అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యల చిట్టా ఇదే..
– జిల్లాలో 8 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే భవనాలన్నీ సరిగా లేవు. లేబర్ రూంకు ఇబ్బంది అవుతోంది. సివిల్ వర్క్స్ జరగాల్సి ఉంది. 24 గంటలు పని చేసే 42 పీహెచ్‌సీల్లో వాచ్‌మన్లు లేరు.
– సబ్‌సెంటర్లకు సొంత భవనాలు లేవు. అద్దె కూడా తక్కువగా ఉంది. కొందరు ఏఎన్‌ఎంలు చేతి నుంచి డబ్బులు వేసుకుంటున్న పరిస్థితి ఉంది.
– వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 47 మెడికల్ ఆఫీసర్ల ఖాళీలున్నాయి. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినా చాలా మంది రావడం లేదు. 29 స్టాఫ్‌నర్సు, 29 ఫార్మసిస్టు పోస్టులు భర్తీ కావాలి. 13 ల్యాబ్ టెక్నీషియన్స్, రెండో ఏఎన్‌ఎం పోస్టులు 116 ఖాళీగా ఉన్నాయి.
– జిల్లాలో సీమాంక్ సెంటర్లలో వైద్య పరికరాలు లేవు.
– క్షయ వ్యాధి నిర్ధారణ కోసం వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ల్యాబొరేటరీలు ఉన్నా టెక్నీషియన్ల కొరత ఉంది. 36 పోస్టులు భర్తీ కావాలి.
– వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టుల కొరత ఉంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో పరిస్థితి చేయి దాటాక సర్వజనాస్పత్రికి తెస్తున్నారు. ఇక్కడ సరిపడా వసతులు లేవు. 60 పడకలు ఉంటే మూటింతల మందికి సేవలందిస్తున్నాం. ఈ క్రమంలో ఒక్కో బెడ్‌లో ముగ్గురికి చికిత్స ఇవ్వాల్సి వస్తోంది.
– సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఐదు స్టాఫ్‌నర్సు పోస్టులు భర్తీ కావాలి. ఒక వాచ్‌మన్‌ను అదనంగా నియమించాలి. హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎన్‌ఆర్‌సీలో కూడా ముగ్గురు స్టాఫ్‌నర్సులు కావాలి.
– అంధత్వ నివారణ సంస్థకు మొబైల్ యూనిట్ కావాలి. ఆప్తాల్మిక్ సర్జన్స్ పోస్టులు భర్తీ చేయాలి.
– క్షయవ్యాధి నివారణ కోసం 30 పడకలతో ప్రత్యేక వార్డు మంజూరు చేయాలి.