విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
► రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న
► అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభం
బేల : గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్–21 నిధులు రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల ప్రారంభానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వం 250 గురుకులాలను ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు ప్రత్యేకంగా 109 గురుకులాలు త్వరలోనే మంజూరు కానున్నాయని తెలిపారు. బేలలో డిగ్రీ కళశాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానిక జూనియర్ కళశాలలో ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకోవాలని, లక్ష్యంతో భవిష్యత్‌లో గమ్యం చేరాలని తెలిపారు.
ప్రతి సంవత్సరం మండలంలో మొత్తంగా ఏవైనా రెండు సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల సబ్సిడీ నిధుల విడుదలలో వాస్తవంగా జాప్యం జరిగిందని, ఈ నెలాఖరులోపు నిధులన్నీ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి విడుదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి నాగేందర్, జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, ఎంపీపీ అధ్యక్షుడు కుంట రఘుకుల్‌రెడ్డి, కళశాల ప్రిన్సిపాల్ కన్నం మోహన్ బాబు, కస్తూరిబా ప్రత్యేక అధికారి గేడాం నవీన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిపుంగే సంజయ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్‌వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి టాక్రే మంగేష్ పాల్గొన్నారు.
వినతుల వెల్లువ
బేల : అదనపు తరగతుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు వినతులు వెల్లువెత్తాయి. రజక, కుమ్మర, కమ్మరి, మేదరి, ప్రధాన్ పురోహిత్, గున్ల, తదితర సంఘాల వారు మంత్రిని ఘనంగా సన్మానించి.. కమ్యూనిటీ హాల్‌లు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. కస్తూరిబా బృందం, కాంట్రాక్ట్ లెక్చరర్లు, గిరిజన సంక్షేమ, ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు క్రమబద్ధీకరణ, 10వ పీఆర్‌ఎసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఆ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.