ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లు
ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.
– హోంమంత్రి చినరాజప్ప
కర్నూలు(లీగల్): ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు నగర శివారులోని జిల్లా జైలును అధికారికంగా ఆయన ప్రారంభించారు. శాననమండలి చైర్మన్ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ.. 23 ఎకరాల విస్తీర్ణంలో రూ.13 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించినట్లు చెప్పారు. ఇందులో రూ.3 కోట్ల వ్యయంతో వైద్యశాల నిర్మిస్తున్నట్లు వివరించారు.. ప్రస్తుతం జైలులో 50 మంది ఖైదీలున్నారని, కడప జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన ఖైదీలను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జైలుకు అవసరమైన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోడుమూరు ఎమ్మెల్యేకు సూచించారు.
ప్రస్తుతం జైలులో ఖైదీలు సిమెంట్ ఇటుకలు తయారు చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ.. జైలును రాజమహల్‌గా తయారు చేస్తున్నారని, ఇందుకు సహకరించిన హోంమంత్రి, సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శిల్పాచక్రపాణిరెడ్డి, సుధాకర్ బాబు, జైళ్ల శాఖ డీజీ ఆర్.వి.రాజన్, ఏపీ పోలీసు శాఖ హౌసింగ్ ఎండీ కె.వి.రాజేంద్రరెడ్డి, జైళ్ల శాఖ డీఐజీ కడప రీజియన్ జి.జయవర్ధన్, ఐజీపీ బి.సునిల్‌కుమార్, కర్నూలు డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, జిల్లా జైళ్ల శాఖ అధికారి వరుణా రెడ్డి, కర్నూలు ఆర్‌డీఓ హుసేన్‌సాహెబ్, పంచలింగాల సర్పంచ్ అనంతలక్ష్మి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.