
మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలి..
- కేబుల్ ఆపరేటర్లను వాటాదారులుగా చేర్చాలి..
- ఆరు ప్రాంతాల్లో త్వరలో వైఫై సౌకర్యం
- టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం గాంధీచౌక్ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) సేవల్లో ప్రైవేటు సెక్టార్లను అధిగమించాలని జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ భవనంలో జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సమావేశాల్లో చర్చించిన అంశాలు, వాటి పురోగతిపై అధికారులు వివరించాలని సూచించారు. రహదారుల అభివృద్ధి వల్ల కేబుల్ వైర్లు దెబ్బతింటున్నాయని, దీంతో సేవలకు అంతరాయం కలుగుతుందని అధికారులు వివరించారు. మిషన్ భగీరథ వల్ల కూడా కేబుల్ వైర్లు దెబ్బతింటున్నాయని వివరించారు. కొందరు కమిటీ సభ్యులు మాట్లాడుతూ అధికారులు కొత్త స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారని, కనీసం కమిటీ సభ్యులకు కూడా తెలియపరచటం లేదన్నారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు సక్రమంగా లేవని, మార్కెటింగ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని పలువురు సభ్యులు ఆరోపించారు. దీంతో ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులకు ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడంతో వ్యవస్థ నానాటికి వెనకబడుతుందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని, ప్రజలకు సేవలందించకపోతే సంస్థ మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. సాంకేతికంగా వ్యవస్థను అభివృద్ధిపరిచే దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ప్రైవేటు కేబుల్ ఆపరేటర్లను సంస్థలో భాగస్వాములను చేస్తే వ్యవస్థ మెరుగుపడుతుందని సంస్థ అధికారులు చెబుతున్నారని, ఆ దిశగా కృషి చేయాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో లక్ష కనెక్షన్లు గిరిజనులకు ఉచితంగా ఇచ్చే విధంగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఉచిత వైఫై కనెక్షన్లు తొలుత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 100 మీటర్ల రేడియస్‌లో వైఫైలు పని చేస్తాయన్నారు.
జీతానికి న్యాయం చేయాలి : కోచైర్మన్ సీతారాంనాయక్
టెలికం శాఖ ఇచ్చే జీతానికి న్యాయం చేయాలని జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ కోచైర్మన్, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ ఎక్కడ ఉంటే మనం అక్కడకు వెళ్లి మాట్లాడాల్సిన దుస్థితి ఉందని, అదే ప్రైవేటు సిగ్నల్స్ మన చుట్టూ ఉంటాయని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగిందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు ఉన్న వారు ఆదివారం ఉచితంగా మాట్లాడుకోవచ్చని ఎంతమందికి తెలుసు? ఎన్ని గ్రామాల వారికి తెలుసు? అధికారులు ఈ విషయాన్ని ప్రచారం చేశారా? అని అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్ కల్పించే విధంగా అధికారులు కృషి చేయటం లేదని విమర్శించారు. టెలికం జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ నరేందర్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లకు 35 శాతం వాటా కల్పించి.. వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే అవకాశం ఉందని తెలిపారు. మన పక్కనే ఉన్న మహబూబాబాద్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.