విచ్చలవిడి మద్యం విక్రయాలతోనే నేరాలు
విచ్చలవిడి మద్యం విక్రయాలతోనే నేరాలు
Published Sun, Sep 4 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
–మహిళలపై దాడులు ఆందోళనకరం
–మద్యం మత్తులోనే 90 శాతం..
–జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(హాస్పిటల్): విచ్చలవిడిగా మద్యం లభిస్తుండటం వల్లే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వ పాలసీ కాబట్టి దానిని వ్యతిరేకించడం లేదన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలే మద్యాన్ని నియంత్రించాలన్నారు. ఫాగ్సీ(గైనకాలజిస్టుల సంఘం) ఆధ్వర్యంలో మహిళల రక్షణపై ఆదివారం స్థానిక మౌర్య ఇన్‌లో కవచ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాలు ఆందోళన, భయం కలిగిస్తున్నాయని చెప్పారు. గుంటూరులో తాను ఎస్పీగా పనిచేసిన కాలంలో దాడుల నుంచి రక్షణ కోసం మహిళలకు కారంపొట్లాలు పంచినట్లు గుర్తు చేసుకున్నారు. అలాగే ఫ్యాగ్సీ ఆధ్వర్యంలో కవచ్ ప్రోగ్రామ్ కింద పెప్పర్ స్ప్రే బాటిళ్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. పాఠశాలలు, కళాశాలలు, పనిచేసే చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆడపిల్లలకు మార్షల్స్ ఆర్ట్స్ నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. నగరంలో నేరాలు అరికట్టేందుకు నివాస కాలనీలు, పాఠశాలలు, కాలేజీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఫాగ్సీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ దేశంలో స్త్రీలు పూజింపబడటం లేదని, ఇంకా తమకు స్వాతంత్య్రం రానట్టే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కవచ్ కార్యక్రమం ద్వారా ఆడవాళ్లు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఆమె మానిటర్ ద్వారా వివరించారు. అనంతరం సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ ఆర్‌జే శ్రీనివాసన్‌ను ఘనంగా సన్మానించారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆయనను కుర్చీలో కూర్చోబెట్టుకుని, ఆ కుర్చీని జిల్లా ఎస్పీ తో పాటు వైద్యులు ఎత్తుకుని వేదిక వద్దకు తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఫాగ్సీ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పీసీ మహాపాత్ర(భువనేశ్వర్), జిల్లా కార్యదర్శి డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ అంజనప్ప, గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement