కష్టాలు.. కన్నీళ్లు.. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు | problems for contract lecturers | Sakshi
Sakshi News home page

కష్టాలు.. కన్నీళ్లు.. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు

Published Wed, Aug 24 2016 6:51 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

కష్టాలు.. కన్నీళ్లు.. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు - Sakshi

కష్టాలు.. కన్నీళ్లు.. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు

నిడదవోలు : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి నుంచి ఇప్పటివరకు కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడంతో పాటు జీతాలు విడుదల కాలేదు. దీంతో అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. 
జిల్లాలో 300 మంది..
జిల్లాలో మొత్తం 300 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిలో 32 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 240 మంది, 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 60 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కషిచేస్తున్నారు.  దీంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది కొద్దిమేర అడ్మిషన్ల శాతం కూడా పెరిగింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో జీతాలు లేకుండానే వీరంతా గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. 
జిల్లాలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు
కళాశాల సంఖ్య అధ్యాపకులు
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 32 240
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 12 60
.............................
16 ఏళ్లుగా చాలీచాలని జీతంతో.. 16 ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలనీ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే గద్దెనెక్కి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. సబ్‌ కమిటీ వేసి నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారని, ఇప్పటికీ ఒక్కసారికూడా సబ్‌కమిటీ మంత్రులు సమావేశం నిర్వహించలేదని అంటున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించే వరకూ అయినా జీవో 03 ప్రకాం పదో వేతన సవరణ సంఘ సిఫార్సుల మేరకు జీతాలు పెంచాలని కోరుతున్నారు. 
2000లో నియామకం.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యాబోధన చేసేందుకు అప్పటి టీడీడీ ప్రభుత్వం వీరిని నియమించింది. ప్రారంభంలో వీరికి ఏడు నెలలకు ఒక్కసారి జీతాలు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు రూ.4,500 జీతం ఇవ్వగా 2006లో దివంగత మాజీ సీఎం వైఎస్సార్‌ నెలకు రూ.7,500కు జీతం పెంచారు. 2010లో విద్యార్థి, ప్రజా సంఘాలు ఉద్యమం చేపట్టడంతో వీరి జీతం నెలకు రూ.18 వేలకు పెరిగింది. 
ఉద్యమం చేపడతాం 
కాంట్రాక్ట్‌ అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే రెన్యూవల్‌ చేయాలి. పెండింగ్‌లో ఉన్న జీతాలు విడుదల చేయాలి. సక్రమంగా రాని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడం తప్ప మరో దారి లేదు. ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి.  –గోపే శ్యాంకుమార్, జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు
ప్రసూతి సెలువు ఇవ్వాలి
మహిళా కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 16 ఏళ్లుగా పనిచేస్తున్నాం ఇప్పటికీ సర్వీసులు రెగ్యులర్‌ కాలేదు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. అధ్యాపక వత్తినే నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.  –పి.సుజాత, కాంట్రాక్టు అధ్యాపకురాలు, నిడదవోలు
వేతనాలు పెంచాలి 
పదో పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలి. 2000లో ఉద్యోగంలో చేరాం. ఎప్పటికైనా రెగ్యులర్‌ చేస్తారనే ఆశతో ఉన్నాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్టు ఉద్యోగాలు తొలగిస్తారనే భయం మాలో ఉంది. మమ్మల్ని రెగ్యులర్‌ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలి.–కె.ఆంజనేయులు, కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, నిడదవోలు 
రెన్యూవల్‌ చేయాలి
కళాశాల తెరచి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఉద్యోగాలను రెన్యూవల్‌ చేయలేదు. దీంతో జీతాల విడుదలలో జాప్యమవుతోంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వానికి మా బాధలు పట్టడం లేదు. పెండింగ్‌ వేతనాలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి. –కె.వేణు కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, నిడదవోలు
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement