సమస్యల అశోక్‌నగర్
-
రోడ్లపై వెళ్తే నడుంనొప్పి ఫ్రీ
-
నిండిపోతున్న చెత్త కుండీలు
-
చోద్యంచూస్తున్న అధికారులు
కరీంనగర్ కార్పొరేషన్ : అధ్వానంగా రోడ్లు.. నిండిపోయిన చెత్తకుండీలు..కంపుకొడుతున్న ఖాళీస్థలాలతో అశోక్‌నగర్ సమస్యలకు నిలయంగా మారింది. రోడ్లపై గుంతలుపడి నడిచేందుకు వీలులేకుండా తయారయ్యాయి. ట్రాన్స్‌పోర్టు కంపెనీల అడ్డాలు సైతం ఇక్కడే ఉండడంతో రహదారులు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9వ డివిజన్ అశోక్‌నగర్‌లో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రెయినేజీలు, చెత్తకుండీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నాలుగు డివిజన్ల కూడలి బొమ్మవెంకన్న చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్లుపై గుంతలు పడి నడిచేందుకు ఇబ్బందిగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డు మరింత ఛిద్రమైంది. దీనికి తోడు వివిధ ట్రాన్స్‌పోర్టుల అడాలు కూడా ఇక్కడే ఉండడంతో ప్రతీరోజు భారీ వాహనాలు రోడ్లను మరింత అధ్వానంగా చేస్తున్నాయి. ఇదే ఏరియాలో రెండు పాఠశాలలు, రైతు బజారు ఉండడంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అధ్వాన రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. అశోక్‌నగర్‌లో అంతర్గతరోడ్లన్నీ అధ్వానంగానే ఉన్నాయి.
ప్యాచ్‌వర్క్ కరువాయే
గతేడాది అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) పైపులైన్ వేసేందుకు రోడ్లు తవ్వారు. పైపులైన్ వేశాక ప్యాచ్ వర్క్ చేయాల్సిన కాంట్రాక్టర్ అలాగే వదిలేశారు. దీంతో మట్టి రోడ్లు కాస్తా బురదమయమయ్యాయి. రోడ్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. శనివారం అంగడిరోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుబజార్ అక్కడే ఉన్నందున వ్యవసాయశాఖ అధికారులు కూడా పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గుంతలతో నిండిన ఈ రోడ్లపై ఎగుడుదిగుడూ ప్రయాణం చేస్తూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గుంతలరోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది.
చెత్తపై నిర్లక్ష్యమే
నగరంలో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. 9వ డివిజన్‌లోని ఎన్‌ఎన్‌గార్డెన్ సమీపంలో ఉన్న చెత్త కలెక్షన్ పాయింట్ వద్ద ఆరు రోజులుగా చెత్త వేయడం తప్ప, డంప్‌యార్డుకు తరలించిన దాఖలాలు లేవు. దీంతో పందులకు అడ్డాగా మారింది. రోగాలు ప్రబలకముందే చెత్తను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.