రాజేష్‌ హత్య కేసులో పురోగతి | progress in Rajesh murder case | Sakshi
Sakshi News home page

రాజేష్‌ హత్య కేసులో పురోగతి

Published Fri, Mar 3 2017 11:25 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

రాజేష్‌ హత్య కేసులో పురోగతి - Sakshi

రాజేష్‌ హత్య కేసులో పురోగతి

► ఆదిబట్ల పోలీసుల అదుపులో నిందితులు..!
► నేడు వివరాలు వెల్లడించనున్న పోలీసులు  


ఇబ్రహీంపట్నంరూరల్‌: గుంటి రాజేష్‌ హత్య ఉదంతానికి తెరపడింది. గత మూడు రోజులుగా హంతకుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఊపిరి పీల్చుకున్నారు. మామిడి శ్యాంసుందర్‌రెడ్డిపై ముందు నుంచీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా చివరికి అదే నిజమైంది. పథకం ప్రకారమే రెక్కీ నిర్వహించి రాజేష్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. వివరాల్లోకి వెళితే... ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన గుంటి రాజేష్‌ను కొందరు వ్యక్తులు గత నెల 27న రాత్రి 10.15 గంటలకు ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్  పరిధిలోని తుర్కయంజాల్‌లో ఉన్న మిత్రబార్‌ ఎదుట అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం శ్యాంసుందర్‌రెడ్డితో పాటు ముగ్గురు ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్ లో లొంగిపోవడానికి వస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో రావిర్యాల్‌ సమీపంలోని వండర్‌లా ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఈ హత్యలో శ్యాంసుందర్‌రెడ్డి నేరుగా పాల్గొనగా మరో ముగ్గురు వ్యక్తులు.. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌ (27), చిత్తూరు జిల్లా మెల్లాచెర్వుకు చెందిన పోగారి దయాకర్‌(27), అనంతపురం జిల్లా నారప్పగారిపల్లికి చెందిన కుంచెపు రమణా(36)లు ఈ హత్యలో ఉన్నట్లు సమాచారం. వీరంతా ప్రస్తుతం ఆదిబట్ల పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పాతకక్ష్యలే రాజేష్‌ హత్యకు కారణంగా తెలుస్తోంది. అయితే ఇంతకూ వీరు లోంగిపోయారా.. లేదా అరెస్టు చేశారా అన్న ఉత్కంఠ వీడటం లేదు.పోలీసుల అదుపులో ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

ఈ హత్య ఉదంతంపై ఇప్పటికే అన్ని రకాలుగా పోలీసులు విచారణ పూర్తి చేసినట్లు తెలిసింది. నేడు(శుక్రవారం) రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా హత్యకు కారణమైన శ్యాంసుందర్‌రెడ్డి గత రెండు రోజుల క్రితం వివిధ మీడియాలో మాట్లాడుతూ తన కుతురు మరణమే కాకుండా ఇంకొంత మంది ఆడపడుచులతో అసభ్యంగా ప్రవర్తించిన రాజేష్‌ మరణం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి అల్లరి మూకలకు సరైన శిక్ష పడిందని మీడియాలో మాట్లాడారు. అమ్మాయిల మానప్రాణాలతో అడుకునే వారికి ఈ హత్య చక్కని గుణపాఠం లాంటిదని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement