ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని..
–కూతురిని కాదన్న తండ్రి
–– ఇంటి ఎదుట బైఠాయించిన కూతురు
–––న్యాయం చేయాలని అధికారులకు వినతి
బుగ్గబాయిగూడెం (వేములపల్లి) : ఆస్తి పంచాల్సి వస్తుందని సొంత కూతురినే కాదంటున్న తండ్రి వైనం మండలంలోని బుగ్గబాయిగూడెంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రేఖ వెంకయ్య, మహబూబమ్మ అనే దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వారికి ఓ కుమార్తె (చక్రపాణి) పుట్టిన అనంతరం విడిపోయారు. ఈ క్రమంలో చిన్నారి చక్రపాణిని మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో ఉన్న అమ్మమ్మ బొల్లమ్మ వద్ద వదిలిపెట్టి తల్లి మహబూబమ్మ వేరే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె అలనాపాలనా పూర్తిగా అమ్మమ్మే చూసుకుంది. చక్రపాణి పెద్దయ్యాక బొల్లం సైదులు అనే వ్యక్తితో వివాహం కూడా చేసింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే చిన్ననాటి తల్లిదండ్రులు తనను కాదనుకున్నా చక్రపాణి మాత్రం ఎప్పుడూ వద్దనుకోలేదు. చిన్నతనం నుంచి తండ్రి వెంకయ్య ఇంటికి తరుచూ వెళ్లేది. వారు ఇంట్లోకి రానియ్యకుండా వెళ్లగొట్టేవాడని ఆమె ఆవేదనతో పేర్కొంది. అయితే ఇటీవల తన తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని వెంకయ్య తమ్ముడైన కృష్ణ కుమార్తె నిర్మలకు రాసి ఇచ్చారని తెలిపారు. తనకు దక్కాల్సిన ఆస్తిని తన తండ్రికి మాయమాటలు చెప్పి కాజేరంటూ ఆమె ఆరోపిస్తోంది. అనేక పర్యాయాలు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ దాన్ని తెగకుండా వాయిదాలు వేస్తూ రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను దీక్ష చేపట్టినట్టు పేర్కొంది. తాను కూతురు కాదంటున్న తండ్రికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తే నిజనజాలు బయటపడతాయని తెలిపింది. ‘మీ అమ్మ పోయిన నాడే నువ్వు కూడా పోయావు’ నాకు సంబంధం లేదంటూ తండ్రి చెప్పడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.