అడవి పందుల నుంచి రక్షణ ఇలా..
- కొన్ని పద్ధతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవు
- సదాశివపేట ఏఈఓ ప్రవీణ్
సదాశివపేట రూరల్: అడవి పందుల వల్ల అనేక గ్రామాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లుతోందని సదాశివపేట ఏఈఓ ప్రవీణ్ తెలిపారు. వాటిబారి నుంచి పంటలు కాపాడుకోవడానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు.
టపాసులు పేల్చడం
ఒక పెద్ద టెంకాయ తాడును తీసుకొని రెండుమూడు పురులతో 30 అడుగుల పొడవు ఉండే లా ఏర్పాటు చేసుకోవాలి. పురుల మధ్య ఒకదాని వెనుక ఒకటి కొద్ది దూరంలో టపాసులు పెట్టాలి. ఆ తాడును ఒక పెద్ద వెదురు గడకు వేలాడదీసి, దాన్ని పొలంలో ఒక ఎత్తు ప్రాం తంలో నాటుకోవాలి. రాత్రిళ్లు ఈ టెంకాయ తాడుపురికి నిప్పంటించాలి. తాడు కాలుతూ మధ్యలో ఉన్న టపాసులు అప్పుడప్పుడు పేలడం వల్ల వచ్చే శబ్ధాలకు అడవి పందులు పంటల దరిచేరవు. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా దాదాపుగా అవి వచ్చే అవకాశం లేదు.
ఫ్లోరైడ్ గుళికలు
ఫ్లోరైడ్ గుళికలు 100 గ్రాముల చొప్పున పది గుడ్డ సంచుల్లో మూటకట్టి వాటిని ప్లాస్టిక్ కవర్లలో అమర్చి దారం సహాయంతో పొలంలో అక్కడక్కడా ఏటవాలుగా నాటిన గడలకు వేలాడదీయాలి. ఈ గుడ్డ సంచులను అప్పుడప్పుడూ నీటితో తడపాలి. అలా చేయడం ద్వారా వచ్చే వాసన.. పొలం చుట్టూ వ్యాపించడం వల్ల అడ వి పందులు వచ్చే అవకాశం ఉండదు.
గుడ్డ సంచులు వర్షానికి ఎక్కువగా తడవకుండా ప్లాస్టిక్ కవర్లు కాపాడతాయి. అవి తడిపే క్రమంలో గుడ్డ సంచుల నుంచి నీరు కింద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే అది పెంపుడు జంతువులకు ప్రాణహాని కలిగించగలదు. గుళికల వాసన తగ్గినప్పుడు కొత్త గుళికలు వేసుకోవాలి. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో అడవి పందులు పొలాల్లోకి రాకుండా చేయవచ్చు.
తాటాకు శబ్ధం
పొలంలోకి అడవి పందులు ప్రవేశించే స్థలంలో నాలుగు దిక్కులు, నాలుగు మూటలు గాలి వాటానికి అనుకూలంగా ఎనిమిది చోట్ల, రెండు గడల ఎదురెదురుగా ఉండేట్టు ఆరడుగుల దూరంలో నాటుకోవాలి.
తాటిఆకు పైభాగాన రంధ్రం చేసి దాని నుంచి జీఐ వైరును తీసి రెండు కొనలు ఎదురెదురుగా నాటిన రెండు కొయ్యలకు గట్టిగా కట్టాలి. ఈ వైరుకు మెలికలు లేకుండా చిన్నగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా అన్ని దిక్కుల్లో ఏర్పాటుచేసుకోవడం వల్ల గాలివాటం ద్వారా తాటాకులు వైరు మీదుగా అటూఇటు గడలకు వేగంగా తగులుతూ పెద్ద శబ్ధం చేస్తాయి. దీని వల్ల అడవి పందులు పొలంలోకి రావు.
వెంట్రుకలు వేయడం ద్వారా...
క్షౌ రశాలలో దొరికే వెంట్రుకలు పొలం చుట్టూ వరుసల్లో పరచాలి. అడవి పందులు మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించేటప్పుడు ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి బాధకలగడం వల్ల అవి పొలాల దరిచేరవు.
దుర్వాసన వ్యాప్తి చేయడం వల్ల..
పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో, పది అడుగుల దూరంలో కొయ్యలు నాటి, దానికి పంది చమురు, బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థంతో రుద్దిన దారాన్ని మూడు వరుసల్లో పొలం చుట్టూ చుడితే ఆ దుర్వాసనకు పందులు పారిపోతాయి.
బెలూన్లు, గుడ్డ ముక్కలు
పొలంలో అక్కడక్కడా పది అడుగుల ఎత్తులో గడలు నాటి వాటిని ప్రతి అడుగుకు ఒక ఊదిన బెలూ¯ŒSను దారానికి కట్టి వేలాడదీయాలి. వాటిని చూసిన పందులు భయంతో పరుగులు తీస్తాయి. పొలంలో అక్కడక్కడా ఏడెనిమిది అడుగుల ఎత్తులో గడలు నాటి, వాటి తెల్లని గుడ్డ ముక్కలు జెండాలుగా కట్టాలి. అవి గాలికి ఎగరడం వల్ల పందులు భయపడతాయి. గుడ్డలతో పాటు వాటికి బెలూన్లు కూడా కట్టుకోవచ్చు.
సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు
కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఇది. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే పశువులు, అడవి పందులు వచ్చే అవకాశమే ఉండదు. ఫెన్సింగ్ ద్వారా వచ్చే విద్యుత్తుకు అవి భయపడతాయి. దీని వల్ల ఎలాంటి ప్రాణహాని జరగదు. దీన్ని ఏర్పాటుచేసుకోదలచినవారు వ్యవసాయ శాఖ కార్యాలయంలో స్పందించాలి.