
ఐక్యంగా ముందుకు సాగుదాం
మచిలీపట్నం టౌన్ : బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో బందరు ప్రాంతంలోని 33 వేల ఎకరాల భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి భూములను రక్షించుకునేందుకు రైతులు ఐక్యంగా ముందుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఈడేపల్లిలోని బెల్ ఉద్యోగుల సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మా చినకొండయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పంట భూములను బడా పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందన్నారు. ఈ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ డబ్బులను రానున్న ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రా విఠల్, మారుమూడి విక్టర్‌ప్రసాద్ మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 4,500 ఎకరాల్లో పోర్టును నిర్మించేందుకు నిర్ణయం తీసుకోగా, పోర్టును రెండు వేల ఎకరాల్లోనే నిర్మించాలని రాద్ధాంతం చేసిన టీడీపీ నాయకులు నేడు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో 33 వేల ఎకరాల భూములను లాక్కునేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐసీఈయూ నాయకుడు జి. కిషోర్‌కుమార్ మాట్లాడుతూ పోర్టును నిర్మిస్తే ఈ ప్రాంతానికి ఏఏ పరిశ్రమలు వస్తాయో ఇంకా స్పష్టత రాకుండానే, పరిశ్రమలను నిర్మిస్తామని పారిశ్రామిక వేత్తలు ముందుకు రాకుండానే భూములను లాక్కోవటం దారుణమన్నారు. పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబ్ధుల్‌మతీన్, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ.సీపీఐ నాయకుడు మోదుమూడి రామారావు ,కాంగ్రెస్ నాయకులు రాంప్రసాద్, బి. ధర్మారావు, కుమారి, సీపీఐ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకుడు ఈపూరి రాంబాబు పాల్గొన్నారు.