భగ్గుమన్న కోరుట్ల! | protest in korutla | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న కోరుట్ల!

Published Mon, Aug 22 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

protest in korutla

  • రాస్తారోకోలు..నిరసన ర్యాలీలు
  • ఆమరణ దీక్ష
  • 48 గంటల బంద్‌కు పిలుపు
  • మున్సిపల్‌ వైస్‌ చైర్మన్, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ రాజీనామా
  • కోరుట్ల :  మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడంతో కోరుట్లలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. సోమవారం ఉదయం నుంచే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో మార్పులు జరుగుతున్నాయని మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం 2 గంటల సమయంలో మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌గా మారినట్లు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో కోరుట్ల డివిజన్‌ సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, వాసాల గణేష్, సనావొద్దీన్‌ తదితరులు ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్‌ వద్ద రాస్తరోకో చేశారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరి నిముషంలో ఎమ్మెల్యే, ఎంపీ కోరుట్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. 
    అఖిలపక్షం మద్దతు
    మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కోరుట్ల టీడీపీ అధ్యక్షుడు మానుక ప్రవీణ్, కార్యదర్శులు జిల్లా ధనుంజయ్, తోట నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. కోరుట్లకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. వైస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు నేతి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాలు కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు అడ్డుతగిలాయన్నారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు వెగ్యారపు మురళి, నాయకులు అక్బర్, కలాల భూంసాయిలు మాట్లాడుతూ, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై నాయకుల వివక్ష తగదన్నారు. కోరుట్ల–మెట్‌పల్లిని కలిపి జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పట్టణాధ్యక్షులు సదుబత్తుల వేణు, ఇందూరి తిరుమలవాసు మాట్లాడుతూ కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు ఆందోళన నిర్వహిస్తామన్నారు. 
    48 గంటలు బంద్‌
    మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌గా మార్చడాన్ని నిరసిస్తూ 48 గంటల కోరుట్ల బంద్‌కు సాధన సమితి పిలుపునిచ్చింది. కోరుట్ల పట్టణంలోని కిరాణ వర్తక సంఘం, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల సంఘం ప్రతినిధులు బంద్‌కు సహకరించనున్నట్లు ప్రకటించారు. 
    అమరణ దీక్ష..
    తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం నాయకులు వాసం భూమానందం డివిజన్‌ ఏర్పాటులో కోరుట్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అమరణ దీక్షకు దిగారు. ఈ దీక్షను డివిజన్‌ సాధన సమితి ప్రతినిధులు చెన్న విశ్వనాథం , పేట భాస్కర్, వాసాల గణేశ్, మున్సిపల్‌ వైస్‌ ౖచెర్మన్‌ రఫీయోద్దీన్, బీజేపీ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ ఇందూరి సత్యం ప్రారంభించి మద్దతు ప్రకటించారు.  
    వైస్‌ చైర్మన్‌..బీజేపి ఫ్లోర్‌లీడర్ల రాజీనామా
    కోరుట్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కోరుట్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రఫీయోద్దీన్, బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఇందూరి సత్యం తమ పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా సాధన సమితి ప్రతినిధులు మున్సిపల్‌ చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ దశలో సంఘీబావం తెలిపేందుకు వచ్చిన మున్సిపల్‌ చైర్మన్‌ శీలం వేణు కారును అడ్డుకున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement