- చెత్త తరలింపు వాహనాలకు అద్దెగా భారీ మొత్తం చెల్లిస్తున్న నగరపాలక సంస్థ
- 10 ట్రాక్టర్ల 5 నెలల అద్దె రూ.43.5 లక్షలు, ఏడాదికి రూ.1.04 కోట్లు
- ఆ సొమ్ముతో 17 కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేసే అవకాశం
- అయినా ఆ దిశగా ఆలోచించని అధికార యంత్రాంగం
జనధనం..అద్దెల పర్వం
Published Sun, Dec 4 2016 11:47 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
ప్రజలు రకరకాల పన్నులుగా చెల్లించగా సమకూరిన సొమ్ములో ప్రతి రూపాయినీ ఆచితూచి వెచ్చించాల్సిన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నగరంలోని చెత్త తరలింపులో అధికారులు అనుసరిస్తున్న అనాలోచిత విధానమే ఇందుకు సాక్ష్యం. ‘జనధనం అద్దెలపరం’ అన్న చందంగా.. చెత్త తరలించేందుకు ట్రాక్టర్లు, టిప్పర్ల అద్దెకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వారు ఆ మొత్తంతో కొత్త వాహనాలనే సమకూర్చుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం.
సాక్షి, రాజమహేంద్రవరం :
ప్రస్తుతం అద్దె ప్రాతిపాదికన నడుస్తున్న చెత్త తరలింపు ట్రాక్టర్ల కాంట్రాక్ట్‌ను మరో ఐదు నెలలు పొడిగించి, అందుకు అవసరమయ్యే నిధుల ఆమోదానికి సంబంధించిన ప్రతిపాదనలను యంత్రాంగం స్థాయీ సంఘం ముందుకు తెచ్చింది. ఐదు నెలల పాటు చెత్తను తరలించేందుకు 10 ట్రాక్టర్లకు రూ.43,50,000 చెల్లించేందుకు నిర్ణయించింది. అదే విధంగా చెత్త తరలించేందుకే మరో 8 టిప్పర్లు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఐదు నెలలకు రూ. 45,12,000 చెల్లించేందుకు టెండర్లు ఖరారు చేసింది. ఈ టెండరును షా క¯ŒSస్ట్రక్ష¯ŒS దఖలు చే సింది. ఐదు నెలల కాలానికి 10 ట్రాక్టర్లు, 8 టిప్పర్లకు రూ.87,62,000 నగరపాలక సంస్థ ఆ కంపెనీకి చెల్లించనుంది. ఇందుకు సంబంధించి అవసరమైన నిధులు కేటాయించాలంటూ అధికార యంత్రాంగం స్థాయీ సంఘం
ముందుకు ప్రతిపాదనలు తెచ్చింది. అయితే గత నెలలో జరగాల్సిన స్థాయి సంఘం సమావేశం వాయిదా పడడంతో ఈ ప్రతిపాదనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.2900 చొప్పున నెలకు రూ.87,000 నగరపాలక సంస్థ సంబంధిత కంపెనీకి చెల్లిస్తోంది. ఇలా ఏడాదికి రూ.10,44,000 ఖర్చు అవుతుంది. కొత్త ట్రాక్టర్, హైడ్రాలిక్ ట్రక్కు వెల దాదాపు రూ.6 లక్షలు ఉంటుంది. 10 ట్రాక్టర్ల ఏడు నెలల అద్దెతో 10 కొత్త ట్రాక్టర్లను కొనుగోలు చేయవచ్చు. ఏడాదికి ట్రాక్టర్ల అద్దె కోసం ఖర్చు చేసే రూ.1.04 కోట్లతో 17 ట్రాక్టర్లు కొనుగోలు చేయవచ్చు. ఇదే విధంగా టిప్పర్లకు కేటాయించే నిధులతో సొంత వాహనాలను సమకూర్చుకోవచ్చు. అయితే ఈ దిశగా యంత్రాంగం ఆలోచించకపోవడం గమనార్హం.
కౌన్సిల్‌కు రాకుండా ఐదు నెలలకే టెండర్లు..
నగరంలోని 50 వార్డుల్లో చెత్తను తరలించేందుకు నగరపాలక సంస్థకు 36 వాహనాలు ఉన్నాయి. ఇందులో 12 ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లు నగరపాలక సంస్థ సొంత వాహనాలు కాగా మిగిలిన 18 వాహనాలు అద్దె ప్రాతిపదికన తిప్పుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 9 ట్రాక్టర్లు, మరో 9 టిప్పర్లు ఉన్నాయి. ప్రస్తుతం 10 ట్రాక్టర్లు, 8 టిప్పర్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ. 2,840.50 ఇస్తుండగా ఈ సారి రూ.3,150.50లకు మిగతా కంపెనీల కన్నా తక్కువ ధరకు షా క¯ŒSస్ట్రక్ష¯ŒS టెండర్ దాఖలు చేసింది.
అయితే షా ధర కూడా గతం కన్నా ఎక్కువగా ఉండడంతో యంత్రాగం బేరమాడి చివరకు రూ.2,900లకు నిర్ణయించినట్లు స్థాయీ సంఘానికి పంపిన ఎజెండాలో పేర్కొంది. ఇదే విధంగా టిప్పర్ రోజు వారీ అద్దె రూ. 3,760గా నిర్ణయించింది. ఐదు నెలల కాలానికి 10 ట్రాక్టర్లకు రూ.43,50,000, 8 టిప్పర్లకు రూ.45,12,000 కలిపి మొత్తం రూ.87,62,000 సంబంధిత కంపెనీకి చెల్లించనుంది. రూ.50 లక్షలు మించిన పనులకు కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉండడంతో ఏడాదికి కాకుండా రూ. 50 లక్షల లోపు ప్రతిపాదనలు వచ్చేలా ఐదు నెలలకే అధికార యంత్రాంగం టెండర్లు పిలవడం గమనార్హం.
అద్దె ట్రాక్టర్లపై కార్పొరేష¯ŒS సిబ్బంది విధులు
నగరపాలక సంస్థలో ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 1,350 మంది ఉన్నారు. వీరు ఆయా డివిజన్లలో ఎప్పటికప్పడు చెత్తను తొలగిస్తుంటారు. అద్దె ట్రాక్టర్లు, టిప్పర్లపై డ్రైవర్, పారిశుద్ధ్య సిబ్బందిని సంబంధిత కంపెనీ నియమించాల్సి ఉంటుంది. కానీ పారిశుద్ధ్య సిబ్బందిని నియమించకుండా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులనే ఉపయోగిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ఇలాంటప్పుడు కేవలం ట్రాక్టర్ల అద్దె కోసమే కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరికో చెల్లించడం కన్నా నగరపాలక సంస్థ సొంతంగా ఆ సొమ్ముతో కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే భారీగా ప్రజా ధనం ఆదా అవుతుందని సూచిస్తున్నారు.
ప్రజాధనం వృథా చేయడం తగదు
కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడం తగదు. 10 అద్దె ట్రాక్టర్లు, 8 టిప్పర్లకు ఏడాదిపాటు చెల్లించే నిధులతో సొంతవి కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి కొనుగోలు చేస్తే అవి నరగపాలక సంస్థ ఆస్తులుగా ఉంటాయి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అద్దె ట్రాక్టర్లు, టిప్పర్లపై డ్రైవర్లు, సిబ్బందిని సంబంధిత కంపెనీ నియమించాల్సి ఉండగా నగరపాలక సిబ్బందినే ఉపయోగిస్తున్నారు.
– మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్
Advertisement
Advertisement