గ్రామీణ ఇంటి పథకంపై విసృత ప్రచారం
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ గ్రామీణ ఇంటి నిర్మాణ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకంపై మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం కింద 1.50లక్షలు, రూ.2లక్షల అంచనాతో పేదలకు హౌసింగ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి నిధులతో ఇంటినిర్మాణాలు చేపడతారన్నారు. రూ.1.50లక్షల స్కీమ్‌లు జిల్లాకు 11వేలు, రూ.2లక్షల స్కీమ్‌లో 15వేల ఇళ్లను కేటాయించారన్నారు.
ఉపాధి నిధుల కింద ప్రతి ఇంటికి 90 రోజుల పనిదినాలు ఇస్తారన్నారు. 90 రోజుల ఉపాధి పనిదినాలకు రూ.17,460 అందజేస్తారన్నారు. ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్యలచే తయారు చేసిన ఇటుకలను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. ఈ మేరకు ప్రతి మండలానికి ఒక నిర్మిత కేంద్రాన్ని మహిళా సంఘాలకు కేటాయిస్తారన్నారు. వీరు తయారు చేసే మూడు రకాల ఇటుకలపై ఉపాధి లోగో ఉంటుందన్నారు. దంతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లకు 12వేలు అందిస్తారు. మిగిలిన మొత్తాన్ని హౌసింగ్ వారు అందజేస్తారని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డ్వామా ఏపీడీ మురళీధర్, డీఆర్‌డీఏ ఏపీడీ శివలీల తదితరులు పాల్గొన్నారు.