
24వ తేదీకి ప్రజాసాధికారిత సర్వే పూర్తి
విజయవాడ : జిల్లాలో ఈ నెల 24వ తేదీ నాటికి నూరుశాతం ప్రజాసాధికార సర్వే పూర్తిచేస్తామని సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనీల్ చంద్ర పునేఠకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రజాసాధికార సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఆధికారులతో మంగళవారం ఉదయం అనీల్ చంద్రపునేఠ, సీఎంఆర్‌వో ప్రాజెక్టు డైరెక్టర్ రంజిత్ పాషా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 85 శాతానికి పైగా ప్రజాసాధికార సర్వే పూర్తయిందన్నారు. అర్బన్ ప్రాంతంలో 51కి పైగా పూర్తిచేశామని వివరించారు. ఈ నెల 24వ తేదీ నాటికి నూరుశాతం పూర్తిచేసేలా చర్యలు చేపడ్తామని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థలో 4 లక్షల 36 వేల జనాభాకు 44 శాతం మంది వివరాలు నమోదు చేశామని తెలిపారు. దీనిని మరింత వేగవంతం చేసేందుకు నగరపాలక సంస్థకు అవసరమైన డివైజ్‌లు, ఎన్యూమరేటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్‌తో సమన్వయపరచుకొని నూరుశాతం లక్ష్యం సాధిస్తామన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు.