ఇక్కడికి రావద్దు.. ఇబ్బందులు పడొద్దు
- కాపు రిజర్వేషన్ల కోసం కిర్లంపూడిలో ముద్రగడ దంపతుల ఆమరణ నిరశన
- దీక్షా స్థలికి రావద్దంటూ అభిమానులకు పద్మనాభం పిలుపు
- తూర్పుగోదావరి జిల్లా అంతటా 144 సెక్షన్.. భారీగా మోహరించిన బలగాలు
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. స్వగ్రామం కిర్లంపూడిలోని తమ నివాసంలో దీక్షకు కూర్చున్న ముద్రగడ దంపతులకు రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం లభిస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడివైపు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం ఎవ్వరూ కిర్లంపూడికి రావద్దని, వచ్చి, బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలోపడి ఇబ్బందులు పడొద్దని ముద్రగడ మనవిచేశారు. దీక్ష దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇతరులెవరికీ జిల్లాలోకి ప్రవేశం లేదని ఎస్సీ ప్రకటించారు. దీక్ష ప్రారంభానికి కొద్ది సేపటి ముందు ముద్రగడ మీడియాతో మాట్లాడారు.
కాపు జాతి కోసం చేస్తోన్న న్యాయమైన దీక్షకు మద్దతు పలకాలని మీడియా ద్వారా ముద్రగడ ప్రజలకు విన్నవించుకున్నారు. తాను ముందే చెప్పినట్లు రాష్ట్రంలోని కాపులు ఎక్కడికక్కడే నిరసన తెలియజేయాలని, మధ్యాహ్న భోజనం మానేసి సీఎంకు వినిపించేలా కంచాలపై గరిటెలతో చప్పుడుచేయాలని ఆయన కోరారు. 'నాకు మద్దతు పలికేందుకు సోదరులెవరూ ఇక్కడికి(కిర్లంపూడికి) రావద్దు. మన పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు బ్యాడ్ ఎలిమెంట్స్(దుష్టశక్తులు) ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడికొచ్చి, వాటి చేతుల్లోపడి ఇబ్బందులు పడొద్దు'అని ముద్రగడ తోటి కాపులకు మనవిచేశారు.
తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, ఒంటరిగానైనాసరే దీక్ష చేపడతానని శుక్రవారం ఉదయం తన ఇంటికి వచ్చిన పోలీసులకు పద్మనాభం స్పష్టం చేశారు. జాతికి న్యాయం జరిగేవరకు పోరాటం ఆపబోనని, శాంతియుతంగానే నిరసశన కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన.. అసాంఘిక శక్తుల ప్రభావానికి లోనుకావద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అభిమానులకు పిలుపునిచ్చారు.