మల్లీశ్వరి ఘాట్‌ను మరిచారా?
మల్లీశ్వరి ఘాట్‌ను మరిచారా?
Published Sat, Aug 6 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
విజయవాడ(భవానీపురం) :
మల్లీశ్వరి ఘాట్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గట్టు వెనుక ప్రాంతంలో అనాదిగా ఉన్నవి రెండు ఘాట్లే. అవి భవానీ, మల్లీశ్వరి ఘాట్లు. మల్లీశ్వరి ఘాట్‌ను గతంలో పున్నమి ఘాట్‌గా కూడా పిలిచేవారు. అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా పర్యాటక శాఖకు చెందిన హరిత బరంపార్క్(పున్నమి హోటల్)లో ఏర్పాటుచేస్తున్న పుష్కర ‡ఘాట్‌కు పున్నమి ఘాట్‌గా నామకరణం చేశారు. గతంలో ఎప్పుడూ ఇక్కడ ఘాట్ ఏర్పాటుచేయలేదు. వీఐపీల కోసం ఏర్పాటుచేస్తున్న ఈ ఘాట్‌కు మల్లీశ్వరి ఘాట్‌ను కలుపుతూ మొత్తాన్ని పున్నమి ఘాట్‌గా అధికారులు నిర్ణయించారు. అయితే బరంపార్క్‌లోని పున్నమి ఘాట్ పనులే పూర్తికాలేదు. మరోవైపు మల్లీశ్వరి ఘాట్‌ను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. ప్రజాప్రతినిధులు పున్నమి ఘాట్‌పైనే దృష్టిపెట్టారు. ఈ ఘాట్‌ను పట్టించుకోలేదు.
అన్నీ అడ్డంకులే..
మల్లీశ్వరి ఘాట్ పనులు పూర్తికాకపోవడానికి ఇక్కడ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలోని అన్ని ఘాట్ల పనులకు అవసరమైన ఇసుకను ఇక్కడి నుంచే రవాణా చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన కాంక్రీట్ ప్లాంట్ నుంచే అన్ని ఘాట్లకు కాంక్రీట్ సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి ఇతర ఘాట్లకు ఇసుక, కాంక్రీట్ తీసుకువెళ్లేందుకు లారీలు, టిప్పర్లు రాకపోకలతో ఘాట్ మొత్తం అధ్వానంగా మారింది. కరకట్ట రహదారి నుంచి ఈ ఘాట్‌కు వచ్చే దారి కూడా ఇప్పటివరకు నిర్మించలేదు. ఘాట్‌కు వచ్చే మార్గం పక్కనే పర్యాటక శాఖకు చెందిన హౌస్ బోట్లు తయారుచేస్తున్నారు.
30 శాతం పనులే
ఈ ఘట్‌లో కేవలం 30 శాతం పనులే పూర్తయ్యాయి. మిగిలిన 70 శాతం పనులు పుష్కరాలలోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. షీట్æఫైలింగ్, దానికిపైన మెట్లు, దానిపైన కాంక్రీట్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయలేదు. షీట్‌ఫైలింగ్ కోసం తీసిన గోతులు అలాగే ఉన్నాయి. మట్టి తవ్వకాలు, ఐరన్ బుట్టల తయారీ పనులు జరుగుతూనే ఉన్నాయి. పున్నమిఘాట్‌కు ఈ ఘాట్‌కు మధ్యలోనే పిండప్రదాన షెడ్లు నిర్మించారు. పున్నమి ఘాట్ వీఐపీలకే పరిమితమైతే ఈ ఘాట్‌లో సాధారణ భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉండేది. పుష్కరాల ప్రారంభ సమయానికి ఈ ఘాట్‌లోకి భక్తులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు.
Advertisement
Advertisement