గట్టెక్కుతుందా..!.
గట్టెక్కుతుందా..!.
Published Sun, Mar 5 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
కీలక సమయంలో కాటన్ బ్యారేజ్‌వద్ద తగ్గుతున్న నీటిరాక
నీరు పెంచాలి్సన సమయంలో పడిపోయిన సహజ జలాలు
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
సీలేరుపైనే ఆశలు
ఇప్పటికే బైపాస్ పద్ధతిలో సాగునీరు
ఆంధ్రుల అన్నపూర్ణగా భాసిల్లుతున్న గోదావరి డెల్టాలో రబీ కీలక దశకు చేరింది. పాలు పోసుకుని గింజ గట్టిపడే దశకు వరి చేలు చేరుకున్నాయి. ఈ తరుణంలో రైతులు చేలల్లో ఎక్కువగా నీరు నిల్వ చేసూ్తంటారు. ఇదే సమయంలో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి రాక తగ్గుతూండడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. రబీ వరిసాగును గట్టెక్కించేదెలాగని వారు ఆందోళన చెందుతున్నారు.
అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి డెల్టాలో అధికారుల లెక్కల ప్రకారం 8.86 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. ఇంత విస్తీర్ణంలో సాగుకు కనీసం 85 టీఎంసీల నీరు అవసరం. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి ఎద్దడి ఉండదని భావించారు. కానీ, డిసెంబరు నెలలో అనూహ్యంగా సహజ జలాల రాక పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీనికితోడు సాగు ఆరంభంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వంతులవారీ విధానంతో పరిస్థితి కొంత సానుకూలంగా మారింది.
డెల్టా శివారుల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో రబీ వరి చేలు ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. మధ్య డెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు; తూర్పు డెల్టాలోని కరప, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో సాగు ఆలస్యమైన చోట చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ దశలో చేలల్లో ఎక్కువగా నీరు పెడతారు. కాలువల ద్వారా సమృద్ధిగా సాగు నీరందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 8,540 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా 4,863, బైపాస్ పద్ధతిలో 2,712 క్యూసెక్కుల చొప్పున 7,575 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంటే బ్యారేజ్ వద్ద సహజ జలాలు 965 క్యూసెక్కులు మాత్రమే. తూర్పు డెల్టాకు 2,520, మధ్య డెల్టాకు 1,640, పశ్చిమ డెల్టాకు 4,380 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 105 డ్యూటీ(ఒక క్యూసెక్కు 105 ఎకరాల చొప్పున)లో నీరు అందిస్తున్నారు. పాలు పోసుకుంటున్న సమయంలో డెల్టా కాలువకు 90 డ్యూటీ(ఒక క్యూసెక్కు 90 ఎకరాల చొప్పున)లో నీరు విడుదల చేయాల్సి ఉంది. అంటే మూడు కాలువలకు 8,800 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలి. వేసవి ఎండలు పెరుగుతున్నందున్న ఆవిరి రూపంలో ఎక్కువ నీరు పోతుంది. కాబట్టి కనీసం 9 వేల క్యూసెక్కుల నీరు ఇస్తే శివారుకు సాగునీరందుతుంది. కానీ సహజ జలాల రాక వెయ్యి క్యూసెక్కుల లోపునే ఉంది.
ముందు ముందు ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. పోనీ సీలేరు నుంచి ఇప్పుడొస్తున్నట్టుగా నీరు వస్తుందనే నమ్మకం కూడా రైతులకు లేదు. ఇప్పటికే బైపాస్‌లో 2,712 క్యూసెక్కులు ఇస్తున్నారు. వేసవి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బైపాస్‌ను నిలిపివేస్తే రైతులకు కష్టాలు తప్పవు. నీరు తగ్గడానికి తోడు, వేసవి ఎండలు పెరిగితే చి‘వరి’లో రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది.
Advertisement
Advertisement