అన్నదాత ఆక్రోశం
అన్నదాత ఆక్రోశం
Published Wed, Mar 15 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
పెనుగొండ: సాగు నీటి ఎద్దడితో పంట చేలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. వంతుల వారీ విధానంలోనూ నీటిని అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలోని రామన్నపాలెం వద్ద రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామంటూ అధికారులు దాళ్వా ప్రారంభంలో నమ్మించి నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మధ్యలో నీరు అందకపోవడంతో దిక్కుతోచని స్థిలిలో ఉన్నామన్నారు. ఆచంట కాలువ పరిధిలోని వడలి, రామన్నపాలెం, తామరాడ ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు.
పత్తాలేని నీటి సంఘం నాయకులు
రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన తెలిపినా నీటి సంఘాల నాయకులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పత్తా లేకుండాపోయారు. కనీస సమాధానం చెప్పడానికి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి నీటిపారుదల శాఖ సూపర్‌వైజర్ అబ్బులు రావడంతో ఏఎస్సై బి.నాగిరెడ్డి సమక్షంలో కౌలు రైతు సంఘ నాయకడు గుర్రాల సత్యనారాయణ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు యర్రంశెట్టి భాస్కరరావు, ముద్రౌతు త్రిమూర్తులు, పేరాబత్తుల సత్యనారాయణ, పేరాబత్తుల రామలింగేశ్వరరావు, చిట్యాల వీరన్న, జక్కం కృష్ణారావు తదితరులు నాయకత్వం వహించారు.
శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలి
సార్వా, దాళ్వా సాగులకు నీటి ఎద్దడి రాకుండా దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వంతుల వారీ విధానంతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement