శ్రీ వరి సాగులో నీటియాజమాన్యమే కీలకం
శ్రీరంగాపురం(నడిగూడెం): శ్రీ వరి సాగులో నీటియాజమాన్యమే కీలకమని మండల వ్యవసాయాధికారి ఎండి.జానిమియా తెలిపారు. నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనుల్లో భాగంగా శ్రీరంగాపురంలో యంత్రంతో నాటు పెట్టిన శ్రీ వరి ప్రదర్శనా క్షేత్రాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడతూ ఈ పద్దతిలో తక్కువ నీరు అవసరం పడుతుందన్నారు. ఒక ఎకరాకు పెట్టే నీటితో ఈ శ్రీవరి విధానంలో రెండున్నర ఎకరాలకు సాగు నీరు పెట్టవచ్చని తెలిపారు. వరి నీటి మొక్క కాదని, ఆరుతడి ద్వారా సాగుచేయవచ్చన్నారు. ఈ ప్రదర్శనా క్షేత్రాలకు పంపిణీ చేసిన సోడోమోనాస్ జీవశీలీంద్రనాశినిని పిచికారి చేస్తే అగ్గితెగులు, వేప నూనె పిచికారితో కాండం తొలుచు, ఆకుచుట్టు పురుగులు నివారణ జరుగుతాయన్నారు. కలుపును మాత్రం కోనోవీడర్‌తో నాటు పెట్టిన 40 రోజుల్లోపు ప్రతి 10 రోజులకు ఒక సారి నాలుగుసార్లు కలుపును తొలగిస్తే ఆ కలుపు మొక్కలే ప్రధాన పంటకు పచ్చిరొట్ట ఎరువు అవుతుందన్నారు. దీంతో పిలకలు దుబ్బులు అధికంగా రావడంతో పంట దిగబడి కూడా అధికంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సర్పంచ్ కొల్లు రామారావు, ఉపసర్పంచ్ బండారు గుర్వయ్య, మండల ప్రమోటర్ ఎం.గోపి, రైతులు కొల్లు రాజేందర్ చౌదరి, సూరమ్మ, రంగా, తదితరులు పాల్గొన్నారు.