గోదారి ఎడారి
గోదారి ఎడారి
Published Sun, Feb 26 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
కొవ్వూరు : గోదారమ్మ గుండె ఎండిపోతోంది. నదీగర్భం ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఇసుక మేటలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా పశ్చిమడెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీసాగుకు సీలేరు జలాలే దిక్కయ్యే దుస్థితి దాపురించింది. గోదావరి నదిలో 15 రోజులుగా నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలి తంగా ఫిబ్రవరి నెలాఖరులోనే నది వెలవెలబోతోంది. ఇసుకమేటలు బయటపడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాల కాలువలకు గోదావరి నీరు సక్రమంగా అందాలంటే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.64 మీటర్లు పైబడి ఉండాలి. అప్పుడే కాలువలకు నీటి ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. గరిష్ట నీటిమట్టం కంటే తక్కువగా ఉంటే కాలువల్లో ప్రవాహ వేగం తగ్గిపోతుంది. ప్రస్తుతం నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో ఆనకట్టకు ఎగువన గోదావరి నదిలో ఇసుక మేటలు బయటపడ్డాయి. కనుచూపు మేర ఎడారిని తలపిస్తోంది. నీటి ఎద్దడి పొంచి ఉంది. పశ్చిమడెల్టాలో రబీసాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సీలేరు నుంచి రోజుకు ఏడువేల క్యూసెక్కుల నీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.20 అడుగులకు పడిపోయింది. దీంతో అధికారులూ ఆందోళన చెందుతున్నారు. ఈనెల 9న ఆనకట్ట వద్ద పాండ్‌లెవెల్ 13.32 ఉండేది. వరుసగా నాలుగురోజులుపాటు నీటిమట్టం పడిపోవడంతో సీలేరు జలాల విడుదలను పెంచారు. మూడురోజులపాటు నీటిమట్టం నిలబడింది. ఈనెల 16న 13.28 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతూ 24వ తేదీకి 13.20 మీటర్లకు పడింది.
సహజ జలాల పరిస్థితీ అంతే
దీనికితోడు మరోవైపు నదిలో సహజ జలాల లభ్యత కూడా తగ్గిపోతోంది. పదిరోజుల కిత్రం 2,500 క్యూసెక్యులుగా ఉన్న సహజ జలాలు ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నుంచి 1,500 క్యూ సెక్కుల మధ్య మాత్రమే లభ్యమవుతున్నాయి.
సీలేరు జలాలే ఆధారం
దీంతో పశ్చిమ డెల్టాలో రబీ సాగు పూర్తిగా సీలేరు జలాలపైనే ఆధారపడింది. సీలేరు వద్ద విద్యుదుత్పత్తిని బట్టి నీటివిడుదలలో హెచ్చుతగ్గులు ఉండడంతో బైపాస్ ద్వారా నీటిని సరఫరా చేయాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతున్నారు.
పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శనివారం 4,280 క్యూసెక్కులు చొప్పున 107 డ్యూటీపై(ఒక క్యూసెక్కు 107 ఎకరాలకు) వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,240 క్యూసెక్కులు వదులుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,400, సెం ట్రల్ డెల్టాకు 1,560 క్యూసెక్కుల చొప్పున 110 డ్యూటీపై అందిస్తున్నారు. నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489, ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 358 క్యూసెక్కుల చొప్పున నీరు అందిస్తున్నారు.
సీలేరు నుంచి ఏడువేల క్యూసెక్కులు కోరాం
గోదావరిలో సహజ జలాల లభ్యత గణనీయంగా పడిపోయింది. డెల్టా ఆయకట్టుకు నీటిఎద్దడి పొంచి ఉండడంతో సీలేరు నుంచి ఏడు వేల క్యూసెక్కులు నీరు ఇవ్వాలని కోరాం. విద్యుదుత్పత్తి ద్వారా 4,500, బైపాస్ ద్వారా 2,500 క్యూసెక్కులు ఇవ్వాలని లేఖ రాశాం. విద్యుత్ ఉత్పత్తిని బట్టి నీటివిడుదలలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ప్రస్తుతం 6,500 క్యూసెక్కుల వరకు వస్తోంది. ఒక్కోక్క రోజు తగ్గుతోంది.నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఒక డీఈఈకి సీలేరు జలాల విడుదల పర్యవేక్షణ బాధ్యత అప్పగించాం.
– ఎ¯ŒS.కృష్ణారావు, గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం
గత పది రోజుల్లో ధవళేశ్వరం
ఆనకట్ట వద్ద నీటిమట్టం వివరాలు
తేదీ నీటిమట్టం
మీటర్లలో
ఫిబ్రవరి15 13.28
ఫిబ్రవరి 16 13.28
ఫిబ్రవరి17 13.26
ఫిబ్రవరి18 13.25
ఫిబ్రవరి19 13.23
ఫిబ్రవరి20 13.23
ఫిబ్రవరి 21 13.23
ఫిబ్రవరి 22 13.23
ఫిబ్రవరి 23 13.21
ఫిబ్రవరి 24 13.20
ఫిబ్రవరి 25 13.20
Advertisement
Advertisement