భద్రాచలం: తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నమే నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ ఎ.ప్రియాంక వరద తీవ్రత, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పొంగి పొర్లుతున్న ఉపనదులు..
ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి బుధవారం 5.20 లక్షల క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 6.20 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరదను దిగువకు వదిలారు. దీనికి ఇంద్రావతి నుంచి వస్తున్న సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం జతవుతోంది.
దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజాము వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు చేరుకోవచ్చని అధికారుల అంచనా. ప్రవాహం ఇలాగే కొనసాగితే నేటి సాయంత్రానికి 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది.
అప్రమత్తంగా ఉంటేనే నష్ట నివారణ
గోదావరి నీటిమట్టం గతేడాది అత్యధికంగా 71.3 అడుగులకు చేరి బీభత్సం సృష్టించడంతో.. అధికారులు ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జూలై ప్రారంభంలోనే జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి మండల, డివిజన్ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఏజెన్సీలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భద్రాచలం నుంచి ఇతర మండలాలకు రాకపోకలు స్తంభిస్తాయి.
ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుపల్లి, నడికుడి, గంగోలు, బైరాగులపాడు గ్రామాల వద్ద, చర్ల మండలం కుదునూరు, సుబ్బంపేట గ్రామాల వద్ద ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, నెల్లిపాక, కూనవరం మండలాలకు సైతం పూర్తిగా రవాణా స్తంభిస్తుంది.
పునరావాస శిబిరాలు సిద్ధం
వరద తీవ్రత పెరిగితే బాధితులను తరలించేందుకు ముందుగానే పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మండలానికో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా బఫర్ స్టాక్ ఉంచారు. ప్రజలను తరలించేందుకు ట్రాక్టర్లు, జేసీబీలు, లైఫ్ జాకెట్లు, పడవలను సిద్ధంగా ఉంచారు.
నేడు మంత్రి పువ్వాడ రాక
మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శుక్రవారం ఆ స్థాయికి వరద వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలో మకాం వేయనున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఆయన ఇక్కడే ఉంటారు. మంత్రితో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ అనుదీప్ సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ఇక్కడికి వస్తున్నారు.
గతేడాది 71 అడుగుల స్థాయికి వరద వచ్చినా, ప్రాణ నష్టం జరగకుండా వీరిద్దరూ పక్కా ప్రణాళికతో పని చేశారు. దీంతో ఈసారి వరద సహాయ కార్యక్రమాల కోసం మరోసారి భద్రాచలం వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment