సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/చింతూరు/ సాక్షిప్రతినిధి,ఏలూరు: గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఎగువున తెలంగాణలో వరద కొనసాగగా, దిగువున ఏపీలో తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 6,33,474 క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన 32, దిగువన 23.5, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.7, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 23.07 మీటర్లుగా నమోదైంది.
ధవళేశ్వరం బ్యారేజ్ లోకి 8,68,285 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,56,185 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువున తెలంగాణ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57,496 క్యూసె క్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 56.94 టీఎంసీలకు చేరుకుంది. మరో 34 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,92,529 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20 గేట్లు ఎత్తేసి 2,55,320 క్యూసెక్కులను దిగువకు వదులుతు న్నారు.
కాళేళ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడి గడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ నుంచి 6,10,250 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్ నుంచి 8,79,450 క్యూసె క్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు భద్రాచలం, పోలవరం మీదుగా ధవళేశ్వరం బ్యారే జ్ నుంచి కడలిలో కలవనున్నాయి. కాగా, శని వారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.80 అడుగులకు తగ్గింది. ఇక్కడ ఆది వారం వరద స్వల్పంగా పెరుగుతుంది.
భద్రాచలం వద్ద తగ్గుతూ.. పెరుగుతూ..
భద్రాచలం వద్ద శుక్రవారం నాటికి 44.30 అడుగు లకు చేరిన నీటిమట్టం, శనివారం ఉదయానికి 39.4 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మళ్లీ పెరగడం ప్రారంభమై శనివారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురంలో ప్రస్తుతం వరద ప్రభావం తగ్గుతున్నా తిరిగి పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద గోదావరి వరదనీరు రెండు అడుగుల మేర తగ్గింది. పశ్చిమగోదావరిలోని యలమంచిలి మండలం కనకాయలంకలో వరద పరిస్థితిని కలెక్టర్ పి.ప్రశాంతి పడవలో వెళ్లి పరిశీలించారు. అలాగే ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో వరద పరిస్థితిని నూజివీడు అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment