విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతానికి అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమైందని పేర్కొంది. అల్పపీడనానికి ఆనుకుని 5.8 మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.
ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే తెలంగాణలో నేటి నుంచి మరింత విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం సూచించింది.