–ఆధునికీకరణపై అలసత్వం వీడండి
–డెల్టాకు ఇబ్బంది వస్తే పట్టిసీమను కట్టేయండి
–నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నాయకుల ఆగ్రహం
ఏలూరు (మెట్రో): జిల్లాలో రైతులు నాశనమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు, ఏళ్ల తరబడి ఆధునికీకరణ పనులు చేస్తూనే ఉన్నారు తప్ప పూర్తికావడం లేదు, డెల్టాకు సాగునీటి ఇబ్బంది ఏర్పడితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించే నీటిని నిలిపివేయండి అంటూ అధికారపక్ష నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం బుధవారం సాయంత్రం కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఉండి నియోజవర్గాల పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు అలసత్వం వహిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరేమన్నారంటే..
–ఇరిగేషన్ శాఖ నిర్మాణాత్మకంగా విధులు నిర్వహించకపోవడం వల్ల గతేడాది నలుగురు వ్యక్తులు చనిపోయారనీ, కాలువల్లో నీటి సరఫరా ఏ మేర ఉంటుందో తెలియక నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.
–గత డిసెంబరునాటికే ఆధునికీకరణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు ఎందుకు చేయలేకపోయారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రశ్నించారు. యాంత్రీకరణకు పెద్దపీట అంటున్నా ఎక్కడ జరుగుతుందని నిలదీశారు. జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే పట్టిసీమ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించవద్దన్నారు.
–జిల్లాలో మెట్ట, డెల్టా అనే భేదాలు లేకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎంపీ మురళీమోహన్ కోరారు.
–డిసెంబరునాటికి ఆధునికీకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.
–వంతుల వారీ విధానానికి సహకరిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ చెప్పారు.
–డిసెంబర్ నుంచే దొంగరావిపాలెం నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు.
–రైతులకు సమయానికి నీరు అందించాలని ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకష్ణ, బండారు మాధవనాయుడు కోరారు.
–పంట బోదెలు తవ్వించి నీటిని సజావుగా రైతులకు అందించాలని నీటి సంఘాల అధ్యక్షుడు రామరాజు కోరారు.
–జిల్లా రైతులకు గతేడాది మాదిరిగా ఎక్కడా ఇబ్బంది లేకుండా సాగునీరు సరఫరా చేస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు.
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు సీఈ, ఎస్‌ఈ, డీఈ, ఈఈలు, వ్యవసాయశాఖాధికారులు, నీటి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఆమోదించిన ఆయకట్టు, నీటి లభ్యత
జిల్లాలో మొత్తం ఆయకట్టు: 5,29,962 ఎకరాలు
నికరంగా వరిపంట : 4,60,000
వరదనీటి ప్రకారం గోదావరి నుంచి నీటి లభ్యత అంచనా (తూర్పు, పశ్చిమగోదావరి డెల్టాలకు కలిపి) : 60.29 టీఎంసీలు
సీలేరు నుంచి నీటి లభ్యత అంచనా : 36.58 టీఎంసీలు
మొత్తం అంచనా నీటి లభ్యత : 96.87 టీఎంసీలు
తాగునీటి అవసరాల కోసం : 7.22 టీఎంసీలు
లభ్యత మేరకు పశ్చిమ డెల్టాకు సాగునీటి కోసం : 46 టీఎంసీలు
మిగిలిన సాగునీరు తూర్పుడెల్టాకు ఉపయోగం
ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయండి
రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినా ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందని, తక్షణమే జిల్లాలో రైతులకు రావాల్సిన రూ.90 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రైతులకు నీరు ఇస్తామని చెబుతున్నా అందించడంలో ప్రభత్వుం విఫలమవుతుందన్నారు. క్రాస్‌బాండ్స్ విధానం ద్వారా డెల్టా ప్రాంతాల్లో ఉప్పు నీరు వస్తుందని, దీని వల్ల రైతులు పంటలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్నారు. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో వరినాట్లు పూర్తి చేస్తామని చెబుతున్నారనీ, చెప్పడమే కాకుండా అ ప్రక్రియను పూర్తి చేసి తీరాలని అధికారులను కోరారు. గతంలో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారని క్రాస్‌బాండ్స్ విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని శేషుబాబు అన్నారు.
స్పష్టత కరువు
జిల్లాలో వరి నారుమళ్లు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, ఈ మేరకు నీటి సరఫరాకు నిర్ణయించారు. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొన్నిచోట్ల నారుమళ్లు పూర్తికాని పరిస్థితి ఉంది. దీనిపై ఎవరూ మాట్లాడలేదు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయని, వీటికి కూడా 25 టీఎంసీల నీరు అవసరం అవుతుందన్నారు. ఈ నీటిని పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు తప్ప ఎలా తీసుకువస్తారన్న విషయం చెప్పలేదు.