-
జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ ఏడవ వర్ధంతి
-
నివాళులర్పించిన కార్యకర్తలు, అభిమానులు
-
అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ
-
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎంతో మంది నిరుపేదలు లబ్ధి పొందారని గుర్తు చేశారు. వర్ధంతి సందర్భంగా రాజన్న అభిమానులు ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంపిణీ చేశారు. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ధంసలాపురం, అగ్రహారం, కొత్తూరు, ముస్తఫానగర్, పార్శిబంధం, నిజాంపేట, లకారం చెరువు వద్ద, గొల్లగూడెం రోడ్డు, టేకులపల్లి, శ్రీలక్ష్మినగర్, వికలాంగుల కాలనీ, రాపర్తినగర్, గాంధీచౌక్, చర్చికాంపౌండ్ తదితర ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ముస్తఫానగర్‌లో తుమ్మా అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెపల్లి సైదులు, మందడపు వెంకటరామిరెడ్డి, ఆలస్యం సుధాకర్ మాట్లాడుతూ రైతు పక్షపాతిగా, పేద కుటుంబాల్లో పెద్దన్నగా, వృద్ధుల మనుసుల్లో పెద్ద కొడుకుగా నిలబడి.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా వైఎస్ లబ్ధి చేకూర్చారన్నారు. కొత్తూరులో అన్నదానం చేశారు.
దమ్మపేట మండలంలో వైఎస్సార్ సీపీ నాయకులు సోయం వీరభద్రం, ముల్కలపల్లి మండలం జనగ్నాథపురం సర్పంచ్ సోయం కృష్ణ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దమ్మపేటలో పులిహోర పంపిణీ చేశారు.
కొత్తగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండేటి ఏసుపాదం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి, 7 హిల్స్ సెంటర్, కూలీలైన్, బాబుక్యాంప్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాల్వంచలో వైఎస్సార్ సీపీ నాయకులు బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ చేశారు.
పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, బూర్గంపాడు మండలాల్లో వైఎస్‌కు నివాళులర్పించారు. మణుగూరు అంబేడ్కర్ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అశ్వాపురం, పినపాక, ఏడూళ్ల బయ్యారం మండలాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకట్‌రెడ్డి, నేతలు అహ్మద్ హుస్సేన్, ఉడుముల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ మండలం గోళ్లపాడులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెపల్లి సైదులు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పులిహోర, స్వీట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వనమారెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు.
భద్రాచలంలోని మార్కెట్ సెంటర్‌లో గల వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిచారు. పట్టణంలోని బ్రెష్ వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కడియం రామాచారి పాల్గొన్నారు.
వైరా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. కారేపల్లి సినిమా హాల్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఏన్కూరులో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. ప్రధాన సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుర్సం సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇల్లెందులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జేకే బస్టాండ్ వద్ద వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బయ్యారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, జిల్లా నాయకులు ఎండీ.అఫ్సర్, మాజీ కౌన్సిలర్ సంజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మధిరలోని వైఎస్సార్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు పులిహోర పంపిణీ చేశారు. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి మల్లు నందిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి తూమాటి నర్సిరెడ్డి, జిల్లా నాయకుడు అబ్బూరి రామకృష్ణ చౌదరి పాల్గొన్నారు.