తిమ్మపూర్ గ్రామంలో పాత ఇల్లు
నల్గొండ: రికార్డుల్లో రెవెన్యూ గ్రామమైన తిమ్మాపూర్‌లో నేడు ఒక్కరూ నివాసం లేకపోవడంతో ప్రజలు లేని పల్లెగా మారింది. 70 సంవత్సరాల క్రితం వ్యవసాయబావుల వద్ద ఐదు కుటుంబాలు (వంగాల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీరాంరెడ్డి, మధూసరెడ్డి, కుమ్మరి నర్సింహ) ఇళ్లు నిర్మించుకొని 60 సంవత్సరాల పాటు తిమ్మాపూర్ గ్రామంలో జీవనం సాగించారు. కాలక్రమంలో అంటువ్యాధులు ప్రబలి కొందరు ఊరు వదిలి పోగా మరికొందరు ఉపాధిని వెతుక్కుంటూ నెమ్మాని, పరడ, హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఏపీ లింగోటం, నార్కట్‌పల్లి, చిట్యాల, వెంకటేశ్వర్లబావి, శేరిబావి వంటి గ్రామాలకు వెళ్లి నివసిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పాడుబడిన ఇళ్లు, బావులు, పశువుల కొట్టాలు, గోడలు, పంట పొలాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఇలాంటి గ్రామాన్ని బేచిరాక్‌గావ్ (దీపం వెలగని గ్రామం)గా పిలుస్తుంటారు.
గతంలో ఐదు కుటుంబాలు నివాసం..
2011 జనాభా లెక్కల ప్రకారం తిమ్మాపూర్ గ్రామంలో 5 కుటుంబాలు నివసించేవి. గ్రామం మొత్తం జనాభా 20 మంది వారిలో 12 మంది పురుషులు, 8 మంది సీ్త్రలు ఉన్నారు. వీరిలో 9 మంది కూలీ పనులు చేసేవారిలో 8 మంది పురుషులు, ఒక సీ్త్ర ఉన్నారు. 55.56 శాతం అక్షరాస్యత కలిగిన గ్రామంలో ఇద్దరు మాత్రమే ఓటర్లు ఉండటం విశేషం.
ఆంజనేయస్వామి విగ్రహం తరలింపు
తిమ్మాపూర్‌లో గల ఆంజనేయస్వామి దేవాలయంలో గ్రామ ప్రజలు ఆంజనేయస్వామికి పూజలు చేసేవారు. అంటు వ్యాధులు ప్రబలడంతో గ్రామస్తులంతా ఒకరు తరువాత ఒకరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో గ్రామమంతా ఖాళీ అయ్యింది. దీంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం గ్రామస్తులు తీసుకెళ్లి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించుకున్నారు.
తిమ్మాపూర్ పరిధిలో 500 ఎకరాలు..
కట్టంగూర్ మండంలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తిమ్మాపూర్. ఈ ఊరి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూములు ఉన్నాయి. కానీ ఆ ఊరిలో వరిసాగు, చెట్లు, పక్షులు, గేదెలు, పశువులు, భూమి తప్ప జనం కనిపించరు. ఆ గ్రామం పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తారు. వ్యవసాయ భూమి సాగు వివరాలు, ఇతర విషయాలు రికార్డుల్లో నమోదవుతాయి. గ్రామం రెవెన్యూ పరిధి కావడంతో సంబంధిత అధికారులే భూములను పర్యవేక్షిస్తారు. తిమ్మాపూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 59లో 500 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సుమారు 180 మంది రైతులు పత్తి, వరి, పెసర, కంది పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంగా పచ్చని పొలాల మద్య ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది.
నెమ్మానిలో ఉంటున్నాం
పరడ, నెమ్మాని గ్రామాల మధ్య తిమ్మాపూర్ ఉంటుంది. అక్కడే ఐదు కుటుంబాలు నివసించేవి. చుట్టూ చెట్లు కొండలతో అడవిని తలపించేలా ఉండేది. మా తాత, నాన్న అందరం 60 సంవత్సరాల పాటు జీవనం సాగించాం. ఇప్పుడు నార్కట్‌పల్లి మండలం నెమ్మానిలో నివాసం ఉంటున్నాం. పాస్ పుస్తకాల్లో రెవెన్యూ గ్రామం తిమ్మాపూర్, కట్టంగూర్ మండలం అని ఉండడంతో నార్కట్‌పల్లిలో ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది అవుతోంది.
– వంగాల అనంతరెడ్డి, రైతు, నెమ్మాని
Comments
Please login to add a commentAdd a comment