చింతపల్లి (దేవరకొండ): వృద్ధులైన అమ్మమ్మ, నానమ్మ బస్సు ఎక్కేందుకు పడుతున్న ఇబ్బందులను చూసిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి.. మెట్లు ఎక్కకుండానే బస్సులోపలికి వెళ్లగలిగే ఓ పరికరాన్ని డిజైన్ చేశాడు. సైన్స్ పాఠాల్లోని పాస్కల్ సూత్రాన్ని ఆధారం చేసుకుని, థర్మాకోల్, సిరంజీలు, పైపులతో ప్రొటోటైప్‌ను సిద్ధం చేశాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన తోలు చంద్రయ్య, చిట్టెమ్మ దంపతుల కుమారుడు అజయ్ ఘనత ఇది. అక్కడి జెడ్పీ హైసూ్కల్‌లో 9వ తరగతి చదువుతున్న అజయ్.. ఫిజిక్స్ టీచర్ శ్రీవిద్య సహకారంతో ‘పాస్కల్ డివైజ్ ప్రొటోటైప్’ను రూపొందించాడు.
ఇందులో పాస్కల్ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే ఒక ప్లాట్‌ఫాం ఉంటుంది. బస్సు ఆగినప్పుడు డ్రైవర్ ఒక లీవర్ లాగితే.. ఆ ప్లాట్‌ఫాం డోర్ దగ్గర నేలపైకి వస్తుంది. దానిపైకి ప్రయాణికులు ఎక్కాక మరో లీవర్ లాగితే.. ఆ ప్లాట్‌ఫాం మెల్లగా పైకిలేచి బస్సులోపలికి వెళ్లేంత ఎత్తుకు చేరుతుంది. వారు నేరుగా బస్సులోపలికి వెళ్లొచ్చు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెస్టివల్‌లో ఆకట్టుకున్న ఈ ఎగ్జిబిట్.. సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయవాడలో ఆ ప్రదర్శన జరగనుంది.
పెద్దవాళ్లు ఇబ్బంది పడటం చూసి..
‘‘మా అమ్మమ్మ, నానమ్మ, పెద్దవాళ్లు, గర్భిణులు బస్సు ఎక్కే సమయంలో ఇబ్బందిపడటం చూశాను. వారు సులువుగా బస్సు ఎక్కేలా పరికరం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మా సైన్స్ టీచర్ సహకారంతో ఈ పరికరానికి రూపకల్పన చేశాను. వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, కీళ్లనొప్పులున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. బరువైన లగేజీలను బస్సులోకి తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది..’’ అని అజయ్ చెప్పాడు. ఇక పాస్కల్ డివైజ్‌తో ఎంతో ప్రయోజనం ఉంటుందని, దాతలు ముందుకొస్తే దాని ప్రొటోటైప్ ఆవిష్కరించేందుకు వీలవుతుందని టీచర్ శ్రీవిద్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment