Valentine's Day: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు.. | Valentines Day 2024 Special, Real Life Couples Love Stories On This Special Day In Telugu - Sakshi
Sakshi News home page

Valentine's Day Special Love Stories: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..

Published Wed, Feb 14 2024 8:03 AM | Last Updated on Wed, Feb 14 2024 10:06 AM

Special Story On Valentine Day - Sakshi

ప్రేమ..అదో మధురానుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో.. అప్పుడు ఎవరిపైనో మనసులాగేసే ఉంటుంది.    ఆ సందర్భంలో మనసులోని వింత అనుభావాలను ఆస్వాధించే ఉంటారు.. ‘ప్రేమించడం కన్నా..    ప్రేమించబడడం అదృష్టం’ అన్నాడో సినీ కవి. అలా దాన్ని చివరి వరకు నిలుపుకుని భాగస్వామి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ కొన్ని     జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రేమ..పెళ్లి పీటల వరకు చేరే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఒక్కటయ్యారు. ప్రేమలో గెలిచి దంపతులుగా అన్యోన్య జీవనం గడుపుతున్న కొన్ని జంటల జీవితాలను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ పాఠకుల ముందు ఆవిష్కరిస్తోంది. 

ప్రియురాలిని ప్రయోజకురాలిగా చేసి..
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడేనికి చెందిన బంధువుల అమ్మాయి భవానిరెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరిలో ప్రేమను చిగురింపజేసింది. అయితే, నిరుపేద కుటుంబానికి చెందిన భవానీరెడ్డి డిగ్రీ మధ్యలో చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌రెడ్డి ప్రియురాలిని పీజీ వరకు చదివించాడు. ఆ వెంటనే ఆమెకు వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అయినా.. ఆమెను ప్రోత్సహించడంతో 2019లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో భవానీరెడ్డి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తొమ్మిది నెలల బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. 

అడ్డంకులను అధిగమించి.. 
మోత్కూరు : వారిద్దరి మనసులు కలిశాయి. కులా లు అడ్డుగోడలుగా నిలిచినా ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.. మోత్కూరుకు చెందిన ఎడ్ల శ్రీకాంత్, సముద్రాల సింధూజ దంపతులు. మోత్కూరులో ఫొటోగ్రాఫర్‌ వృత్తి నేర్చుకుంటున్న శ్రీకాంత్‌కు పట్టణంలోని సముద్రాల వెంకన్న కూతురు సంధ్యతో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారింది. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అడ్డంకులు సృష్టించారు. 

సంధ్యను హైదరాబాద్‌లో బీటెక్‌ చదివిస్తూ అక్కడే సోదరుడి వద్ద ఉంచారు. శ్రీకాంత్‌ రెండేళ్ల ఎడబాటు తర్వాత సంధ్యను కలుసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి 15న యాదగిరిగుట్టలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వ్యతిరేకించి సంధ్య తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై కేసు పెట్టినా కోర్టు ప్రేమజంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ దంపతులు మోత్కూరులో ఫొటో స్టూడియో, ఇంటర్నెట్‌ సెంటర్‌ నడుపుకుంటూ తమ ఆరేళ్ల కుమారుడు రెహాన్‌‡్ష, నాలుగేళ్ల కూతురు శ్రీహన్షతో ఆనందంగా జీవిస్తున్నారు.  

పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
రామగిరి (నల్లగొండ): మిర్యాలగూడకు చెందిన తుమ్ములూరి మురళీధర్‌ రెడ్డి హాలియాకు చెందిన పుష్పలత ఇద్దరు బంధువులు. అయినా మొదట్లో వీరికి పరిచయం లేదు. బంధువుల వివాహంలో పుష్పలత తొలిసారిగా మురళీధర్‌ రెడ్డిని చూసింది. ఆ తర్వాత మురళీధర్‌ రెడ్డి అడ్రస్‌ తెలుసుకొని ఉత్తరాలే రాసేది. అవి చూసి తను తెలిసీతెలియక రాస్తుందేమో అనుకునేవాడు. అలా చాలా సార్లు లెటర్లు రాసూ్తనే ఉండేది. అప్పుడు మురళీధర్‌రెడ్డికి అనిపించింది..ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందని. అప్పటికీ వారి చదువు పూర్తి కాలేదు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మురళీధర్‌ రెడ్డి నల్లగొండలో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌గా స్థిరపడగా, పుష్పలత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. అశుతోష్‌ రెడ్డి ఎంఎస్‌ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడగా, అమిత్‌ రెడ్డి డిఫెన్స్‌ అకాడమీలో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. 

ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..
భూదాన్‌పోచంపల్లి : తెలిసీ తెలియని వయస్సులో మైనర్‌ను ప్రేమించాడు. బాలికకు సైతం అతనంటే ఇష్టమే. కానీ తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఏమి అవుతుందోనని భయం. చివరకు ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించారు. అయినా పట్టువిడవకుండా అమ్మా యి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని 38 ఏళ్లుగా అన్యోన్య జీవనం సాగిస్తున్న భూదాన్‌ పోచంపల్లి జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి ప్రేమపెళ్లి గా«థ ఇది. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన కోట మల్లారెడ్డి పోచంపల్లి జెడ్పీ హైసూ్కల్‌లో 9వ తరగతి చదువుతుండగా ఇదే స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సామల పుష్పలతను ప్రేమించాడు. 

ఈ విషయం పుష్పలత తల్లిదండ్రులు, ఇటు స్కూల్‌లో ఉపాధ్యాయులకు తెలిసి రచ్చ అయ్యింది. దాంతో మల్లారెడ్డికి ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులు అడ్డు వచ్చి పుష్పలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఇంటర్‌ పూర్తి చేసిన నాలుగేళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి 1989 మే 10న పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పుష్పలత ప్రస్తుతం పోచంపల్లి మండల జెడ్పీటీసీగా ఉన్నారు. కాగా కోట మల్లారెడ్డి ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణికి గిఫ్ట్‌ ఇస్తూ ప్రేమను చాటుతున్నారు. 

ఒకే ఇంట్లో మూడు ప్రేమ వివాహాలు
కోదాడ: తల్లిదండ్రులు కులాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకోగా.. వారి బాటలోనే వారి ఇద్దరు కుమారులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన దివ్యాంగుడు కందుల పాపయ్య అదే గ్రామానికి చెందిన వెంకట్రావమ్మను 1980వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెద్ద కుమారుడు కందుల మధు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ తన క్లాస్‌మేట్‌ విజయలక్షి్మని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాపయ్య చిన్న కుమారుడు కందుల విక్రమ్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ 2014లో తన తోటి ఉద్యోగి ఉషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రేమ వివాహాలు చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఖండాలు దాటి..  ఇంగ్లండ్‌లో చిగురించిన ప్రేమ
కోదాడ: ఇండియాలో పుట్టిన వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో కలిసిన మనస్సులు కులమతాలకు అతీతంగా వారిని ఒకటి చేశాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో వారిమధ్య  చిగురించిన ప్రేమ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వారు ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసముంటున్నారు.  ప్రేమించడం కన్నా ఆ ప్రేమను నిలుపుకోవడం ముఖ్యమంటున్నారు లంకెల బాలకృష్ణారెడ్డి– నీనశ్రీ దంపతులు. కోదాడకు చెందిన లంకెల బాలకృష్ణారెడ్డి 2007లో ఎంఎస్‌ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌కు వెళ్లాడు.  ఎంఎస్‌ కోసం అదే యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన నీనశ్రీ కూడా చేరారు. ఇద్దరు కులాలు వేరైనా అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య  చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇండియాలో ఉన్న పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఇంగ్లండ్‌ వారసత్వాన్ని  పొందారు. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమించడం.. ప్రేమించబడడం అదృష్టమని దాన్ని చివరి వరకు నిలుపుకొని భాగస్వామి సంతోషాన్నే తమ సంతోషంగా ఇరువురు భావించినపుడే అ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని చెప్పారు.

తొలి పరిచయంలోనే ఇష్టపడి..
హుజూర్‌నగర్‌ : రెండు భిన్న కులాలకు చెందిన యువతీ, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వివాహానికి అంగీకరించక పోడంతో రాజకీయ నాయకుల సహాయంతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం వర్ధాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి బాబు, శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రవీణ  26 ఏళ్ల క్రితం హుజూర్‌నగర్‌లో తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది.  అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో స్థానిక సీపీఐ నాయకుడు కేవీరాజు సహాయ సహకరాంతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెద్దమ్మాయి అఖిల అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై ఇటీవల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కాగా చిన్న కూతురు అచ్యుత బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వారి కుటుంబం హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement