ఫైబర్‌గ్రిడ్ ఎక్కడ?
ఫైబర్‌గ్రిడ్ ఎక్కడ?
Published Mon, Apr 17 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
- జనవరి 5న రామచంద్రపురం సభలో ప్రకటించిన సీఎం
- 45 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు
- 100 రోజులు దాటినా అతీగతీ లేదు
- ఐటీ మంత్రిగా ఆయన తనయుడు లోకేష్ నేడు రాక
- ఇప్పటికైనా ఏర్పాటుచేస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలు
సాక్షి, రాజమహేంద్రవరం : ‘‘రామచంద్రపురం పట్టణంలో 45 రోజుల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం. పట్టణంలో ఉన్న 12,500 ఇళ్లకు కనెక‌్షన్ ఇస్తాం. రూ.149కే టీవీ, ఇంటర్‌నెట్ వినియోగించకోవచ్చు. 45 రోజుల తర్వాత నేను మీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాను’’ - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 5న రామచంద్రపురంలో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో చెప్పిన మాటలు. ఇది విన్న రామచంద్రపురం ప్రజలు సంతోషంలో ఓలలాడారు. ఇక ప్రతి నెలా రూ.149కే కేబుల్ కనెక‌్షన్ వస్తుందని, కంప్యూటర్ ఉన్నవారికి ఇంటర్‌నెట్ బిల్లు కట్టనవసరంలేదని భావించారు. యువత, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా ఇంటర్‌నెట్ ఉపయోగించుకోవచ్చని ఆనందపడ్డారు. ముఖ్యమంత్రి ఈ మాటలు చెప్పి 100 రోజులు దాటింది. ఇప్పటివరకూ ఆ హామీకి అతీగతీ లేదు. 45 రోజుల్లోనే ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటుపై అధికారులకు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. 45 రోజులు పూర్తవుతున్నా ఎటువంటి చర్యలూ కనిపించకపోవడంతో ఎన్నికల హామీల్లాగే దీనిని కూడా చంద్రబాబు గాల్లో కలిపేశారని అనుకున్నారు. తాజాగా చేసిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చారు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు ఐటీ పరిధిలో ఉంటుంది. అప్పటివరకూ ఈ శాఖ పల్లె రఘునాథరెడ్డి వద్ద ఉండడంతో ఐటీ రంగంలో పరుగు తీయలేకపోయామని భావించిన ముఖ్యమంత్రి ఆ శాఖను తన తనయుడికి కట్టబెట్టారు. లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మన జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీ నెరవేర్చడంపై లోకేష్ దృష్టి పెడతారా? లేదా? అని రామచంద్రపురం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Advertisement