రామిలేరులో గోదావరి జలాల ఉధృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్ : రామిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం కుడి ప్రధాన కాలువకు నూజివీడు మండలం పల్లెర్లమూడిలో రామిలేరుపై నిర్మించిన అండర్‌టెన్నెల్ వద్ద సోమవారం తెల్లవారుజాయున గండి పడింది. దీంతో రామిలేరు గోదావరి జలాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహం ఉండటంతో పల్లెర్లమూడి, సీతారామపురం, కొయ్యూరు, బొమ్ములూరు తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల క్యూసెక్కుల గోదావరి జలాలు కోల్లేరులోకి వృథాగా చేరుతున్నాయి. బాపులపాడు మండలం కొయ్యూరు వద్ద రామిలేరు నుంచి పెద్ద చెరువులోకి నీళ్లు మళ్లించేందుకు నిర్మించిన చెక్‌డ్యాం సైతం నీటి వేగానికి పూర్తిగా ధ్వంసమైంది. పొక్లెయిన్ సైతం నీటి ఉధృతికి కొట్టుకొచ్చింది. గట్టు బలహీనంగా ఉన్నచోట్ల గండి పడే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.