వైద్యవృత్తిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి
వైద్యవృత్తిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి
Published Sun, Apr 9 2017 10:41 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ
ఘనంగా ఆర్‌ఎంసీ 54వ స్నాతకోత్సవం
కాకినాడ వైద్యం: వైద్యవృత్తిపై ప్రజలకున్న అపనమ్మకాన్ని తొలగించి వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కోరారు. కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల 54వ స్నాతకోత్సవాన్ని ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఆ సమావేశంలో జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ ఒక రోగి జీవితం చివరి అంకంలో ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికెళితే వైద్యఖర్చుల కోసం భారీగా బిల్లు వేస్తే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందన్నారు. ప్రజారోగ్యంపై పాలకులకు సరైన అవగాహన లేక పోవడం వల్ల సమర్థమైన వైద్యులు అందుబాటులో ఉన్నా మంచి ఫలితాలు రావడం లేదన్నారు. ఆంగ్లం మోజులో పడిన వైద్యులు తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా మరచిపోయారని, తెలుగు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళారత్న అవార్డు గ్రహీత, ప్రముఖ అవధాని గరికిపాటి నరసింహారావు అన్నారు. ప్రాచీన వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని వైద్యులను కోరారు. వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిగ్రీ పట్టా అందుకున్న వైద్యులను, వారిని కష్టపడి చదివించిన తల్లిదండ్రులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె.బాబ్జి అభినందించారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిధులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, గరికిపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 2011వ బ్యాచ్‌కి చెందిన 150 మంది వైద్యులకు పట్టాలను ప్రదానం చేశారు. పలువురు వైద్యులు తమ అనుభవాలను అ«ధ్యాపకులు, ముఖ్య అతిథులతో పంచుకున్నారు. ఆర్‌ఎంసీ అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ లక్ష్మోజీనాయుడు, డాక్టర్ ఎంవీ ఆనంద్, డాక్టర్ ఎస్‌వీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement